
రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం కూలీ. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్, టాలీవుడ్ స్టార్ నాగార్జున, శాండిల్ వుడ్ సూపర్ స్టార్ ఉపేంద్రతో పాటు శృతిహాసన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం బాధ్యతలను లోకేష్ కనకరాజ్ నిర్వహించారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందించారు. నిర్మాణ కార్యక్రమం పూర్తి చేసుకున్న కూలీ చిత్రం ఈ నెల 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
చెన్నైలో తాజాగా జరిగిన ఈ సినిమా వేదికపై నటుడు నాగార్జున మాట్లాడుతూ.. కూలీ చిత్రాన్ని భాషా సినిమాతో పోల్చారు. ఏకంగా వంద 'బాషా' సినిమాలతో సమానంగా కూలీ ఉంటుందని భారీ అంచనాలు పెంచేశారు. రజనీకాంత్ ఇండియన్ సినీ పరిశ్రమలో ఓజి అని నాగ్ తెలిపారు. ఆపై రజనీకాంత్ కూడా నాగార్జున గురించి మాట్లాడుతూ ‘అబ్బా ఏం కలర్, ఏం స్కిన్, హాయ్ అని అలాగే చూస్తుండి పోయాను. నాకు జుత్తు అంతా ఊడిపోయింది. మీ సీక్రెట్ ఏమిటని నాగ్ను అడిగాను. అందుకు ఆయన ఏమీ లేదు శారీరిక కసరత్తులే చెప్పారు’ అని తెలిపారు.
విలన్‌గా నాగ్ ఎందుకు చేశారంటే..
కూలీ చిత్రంలో విలన్గా నాగార్జున నటించడానికి కారణం ఒక సినిమా డైలాగ్ అంటూ రజనీకాంత్ ( Rajinikanth) ఇలా చెప్పారు.' వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన 'గ్యాంబ్లర్' చిత్రంలో అజిత్ చెప్పిన ఒక డైలాగ్ 'ఎంతకాలం మంచివాడిగా నటించేది' మాదిరి నాగార్జున కూడా ఈ చిత్రంతో విలన్‌గా మారారు. కమలహాసనే ఆశ్చర్యపడేలా ఈ చిత్రంలో నాగార్జున నటించారు. నా విజయం రహస్యం శ్రమ మాత్రమే కాదు. భగవంతుడి ఆశీస్సులు కూడా.. నేను బస్ కండక్టర్‌గా పని చేస్తున్నప్పుడు మిత్రుడు ఒకరు బంగారు చైన్ ఇచ్చి సినిమాల్లో నటించమని చెప్పారు. అందుకే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. ఎంత ధనం, పేరు ఉన్నా, ఇంట్లో ప్రశాంతత, బయట గౌరవం లేకపోతే ఏది లేదు.' అని నటుడు రజినీకాంత్ పేర్కొన్నారు. ఈ వేడుకలో నటుడు ఉపేంద్ర, పలువురు చిత్ర ప్రముఖులు, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.