మహేష్, తమన్, రామ్‌చరణ్, అనీష్, అనస్వర, నాగార్జున, వెంకీ కుడుముల
– నాగార్జున
‘‘ఇట్లు అర్జున’ మూవీ గ్లింప్స్ తీసుకువచ్చి, వాయిస్ ఓవర్ చెప్పాలని అనీష్ అడిగాడు. కథ గురించి తెలుసుకుని.. తొలి సినిమాకే మూగవాడి పాత్ర ఎందుకు అని హెచ్చరించాను. నీ కళ్లతో, నీ బాడీ లాంగ్వేజ్‌తో మాట్లాడాల్సి ఉంటుందని చెప్పాను. ‘రంగస్థలం’లో డెఫ్ క్యారెక్టర్ చేయడానికి రామ్‌చరణ్‌కు పది సంవత్సరాలు పట్టింది. ఆరో సినిమాలో(లెనిన్) అఖిల్ బ్లైండ్ క్యారెక్టర్ చేశాడు.
‘ఇట్లు అర్జున’ సినిమాని అనీష్ చూపించాడు. నాకు చాలా నచ్చింది. ఈ సినిమాలో అనీష్ కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ సినిమాలో చాలా పవర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇలా చేయాలంటే చాలా అనుభవం కావాలి. కానీ అనీష్ తొలి సినిమాకే బాగా చేశాడు’’ అని నాగార్జున అన్నారు. అనీష్, అనస్వర రాజన్ జోడీగా నటించిన సినిమా ‘ఇట్లు అర్జున’. అక్కినేని నాగార్జున సమర్పణలో మహేష్ ఉప్పల దర్శకత్వంలో వెంకీ కుడుముల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన మ్యూజికల్ లైవ్ కన్సర్ట్ ఈవెంట్‌కి హీరోలు నాగార్జున, రామ్‌చరణ్, అఖిల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ–‘‘ఇట్లు అర్జున’ మూవీని సమర్పిస్తున్నందుకు చాలా గర్వ పడుతున్నాను. ఈ సినిమాలోని ప్రతి పాటకు తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు’’ అని పేర్కొన్నారు.
రామ్‌చరణ్ మాట్లాడుతూ– ‘‘అనీష్‌కు తన తల్లిదండ్రుల సపోర్ట్ ఉంది. ఇక అనీష్ లైఫ్‌లో ఏదైనా సాధించగలడు. ఈ ఇండస్ట్రీలో కొత్తవాళ్లను నాగార్జునగారు సపోర్ట్ చేసినట్లుగా ఎవరూ చేయరు. అనీష్‌ను కూడా ప్రోత్సహిస్తున్న నాగార్జునగారికి ధన్యవాదాలు. స్వతహాగానే అనీష్‌కు సినిమా అంటే ప్యాషన్. ఈ ఒక్క కారణం చాలు అనీష్‌కు మంచి భవిష్యత్ ఉందని చెప్పడానికి. నా తొలి సినిమాలో నేను యాక్ట్ చేసిన దానికన్నా, అనీష్ తన తొలి సినిమాలో యాక్టర్‌గా బాగా చేశాడనిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.
అఖిల్ మాట్లాడుతూ–‘‘ఇట్లు అర్జున గురించి అనీష్ చెప్పినప్పుడు.. హీరోకు మాటల్లేకుండా సినిమానా? అని షాక్ అయ్యాను. ఈ సినిమా చూశాను. అనీష్ చాలా బాగా యాక్ట్ చేశాడు. ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చి, సినిమాపై ఎంతో గౌరవంగా అనీష్ కష్టపడ్డాడు’’ అని అన్నారు.
అనీష్ మాట్లాడుతూ–‘‘ మా సినిమాను సపోర్ట్ చేస్తున్న నాగార్జునగారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. తారక్ అన్న, రామ్‌చరణ్ అన్న, అఖిల్ అన్నలకు ధన్యవాదాలు. ఈ వేదికపై నేను ఉండే అవకాశాన్ని కల్పించిన మా అమ్మానాన్నలకు ధన్యవాదాలు. వాళ్లు నన్ను నమ్మారు కనుకనే, నన్ను నేను నమ్మి ఇంత దూరం వచ్చాను ’’ అని చెప్పారు.
సంగీత దర్శకుడు తమన్ మట్లాడుతూ–‘‘ఈ సినిమాలో అనీష్ ఒక మూగవాడి రోల్ చేశాడు. అనీష్ మ్యూజికల్‌గా మాట్లాడే బాధత్యను నేను తీసుకున్నాను. ‘చిన్ని చిన్ని’, ‘రణవిహార..’ లాంటి మంచి పాటలు వచ్చాయి’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మహేష్, నిర్మాతలు ‘దిల్’ రాజు, వై. రవిశంకర్, హీరోయిన్ అనస్వర రాజన్ , రైటర్– డైరెక్టర్ మానస, దర్శక–నిర్మాత వెంకీ కుడుముల, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశి తదితరులు మాట్లాడారు.


