
మలయాళ ప్రముఖ నటుడు మోహన్‌లాల్ (Mohanlal)కు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. తాజాగా తను నటించిన చిత్రం హృదయపూర్వం (Hridayapoorvam) రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది. సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు మలయాళ అభిమానులు ఫిదా అయ్యారు. మాళవికా మోహనన్, ‘ప్రేమలు’ ఫేమ్ సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలలో నటించిన ఈ సినిమా ఆగస్టు 28న విడుదలైంది. సెప్టెంబర్ 26న ‘జియో హాట్‌స్టార్’ (Jio Hotstar)లో స్ట్రీమింగ్‌కు కూడా రానుంది.
ఎంతో ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును రీసెంట్‌గా మెహన్‌లాల్ అందుకున్నారు. ఆపై ఇదే ఏడాదిలో ఆయన నటించిన మూడు చిత్రాలు రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరాయి. దీంతో ఆయన అభిమానులు సంతోషంలో ఉన్నారు. 2025 మోహన్‌లాల్‌కు బాగా కలిసొచ్చిన ఏడాదిగా ఎప్పటికీ మిగిలిపోతుందని పేర్కొంటున్నారు. లూసిఫర్ (ఎంపురాన్) రూ. 268 కోట్లు, తుడరమ్ రూ. 235 కోట్ల మేరకు కలెక్ట్ చేశాయి. తాజాగా హృదయపూర్వం చిత్రం కూడా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరింది.
మలయాళ పరిశ్రమలో ఒకే ఏడాదిలో వంద కోట్ల మార్క్‌ను ఏకంగా మూడు చిత్రాలకు అందుకున్న నటుడిగా లాల్‌కు గుర్తింపు దక్కింది. ఆపై ఒక ఏడాదిలో చిత్రపరిశ్రమలో రూ. 600 కోట్లకు పైగా మార్కెట్‌ను క్రియేట్ చేసిన నటుడిగా గుర్తింపు పొందారు. దర్శకుడు సత్యన్ అంతికాడ్‌తో సుమారు పదేళ్ల తర్వాత మోహన్‌లాల్ కలిసి పనిచేశారు. దర్శకుడిగా ఆయనకు వంద కోట్ల సినిమా కూడా ఇదే కావడం విశేషం.