Miss World 2025: ఆరడుగుల బ్యూటీ.. బెడ్‌రూమ్‌లో భర్త చేతిలో నరకం | Miss World 2025: Interesting And Lesser Known Facts About 1999 Miss World Winner Yukta Mukhi In Telugu | Sakshi
Sakshi News home page

మిస్‌ వరల్డ్‌ కధలు: 6అడుగుల బ్యూటీ.. బెడ్‌రూమ్‌లో భర్త చేతిలో నరకం...

Jun 1 2025 11:01 AM | Updated on Jun 2 2025 8:14 PM

Miss World 2025: Interesting Facts About 1999 Miss World Winner Yukta Mukhi

అందాల సుందరి కిరీటం గెలుచుకోవడం గొప్ప గౌరవం. అంతకు మించి గొప్ప అవకాశాలకు మార్గం. అందులోనూ ప్రపంచ సుందరి కిరీటం అంటే... అంతకు మించి.. అయితే మిస్‌ వరల్డ్‌ కిరీటం దక్కగానే అన్నీ దక్కేసినట్టే అనేది అతి కొద్ది మందికి మాత్రమే సాధ్యం అనేది నిజం. అడ్డంకులెన్నో అధిగమించి.. అందాల రాణి అనే అంతర్జాతీయ కిరీటం అందుకున్నా... అత్తింట్లో అష్టకష్టాలు పడే సాదా సీదా అమ్మాయిలు కూడా ఉంటారు. అలాంటి మహిళే యక్తా ముఖి.

ఆమె 1999లో మిస్‌ వరల్డ్‌గా భారతదేశానికి గౌరవం తీసుకువచ్చిన యుక్త ముఖి(Yukta Mukhi)... 5.11 అంటే షుమారు 6 అడుగుల హైట్‌తో కిరీటం దక్కించుకుందే కానీ  అందలాలు అందుకోవడంలో మాత్రం విజయం సాధించలేకపోయింది. ఆ ఒక్క గెలుపు తప్ప ఆ తర్వాత ఏ రకమైన సంతృప్తినిచ్చే గమ్యాన్నీ ఆమె చేరుకోలేకపోయింది.

మిస్‌ వరల్డ్‌గా టైటిల్‌ సాధించిన తర్వాత, ఎన్నో ఆశలతో, తన ముందున్న ఐశ్వర్య రాయ్‌ వంటివారి విజయాల స్ఫూర్తితో యుక్త ముఖీ వెండితెరపై  అడుగుపెట్టింది.  తొలిగా 2001లో పూవెల్లమ్‌ ఉన్‌ వాసమ్‌ అనే తమిళ చిత్రంలో ‘యుక్తాముఖి’ అనే పాటలో కనిపించే అతిధి పాత్రతో ఆమె సినీ ప్రయాణం ప్రారంభమైంది. అనంతరం  2002లో అఫ్తాబ్‌ శివ్‌దాసాని పక్కన ’ప్యాసా’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసినా.. ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది.  ఆ తర్వాత మార్కెట్‌ అనే సినిమా షూటింగ్‌లో ఉండగా, గాయం వల్ల ఆ సినిమా నుంచి వైదొలగింది. 

అనంతరం కబ్‌ క్యోం కహా, హమ్‌ తీనోం..సినిమాలకు సంతకం చేసినా, అవి క్లాప్‌ కొట్టకుండానే అటకెక్కాయి. ఆ తర్వాత మరో రెండు ప్రాజెక్టులు కూడా అలాగే జరిగాయి.  తర్వాత ’కట్పుత్లీ’, ’లవ్‌ ఇన్‌ జపాన్‌’, ’మెమ్సాహబ్‌’ వంటి చిత్రాల్లో నటించినా, అవి కూడా విజయవంతం కాలేదు. దాదాపు 9 ఏళ్ల తర్వాత  2019లో ’గుడ్‌ న్యూస్‌’ చిత్రంలో ఒక చిన్న పాత్రలో మాత్రమే ఆమె కనిపించింది. 

విచిత్రంగా వ్యక్తిగత జీవితం కూడా ఆమెకి విషాదాన్నే మిగిల్చింది. న్యూయార్క్‌కు చెందిన వ్యాపారవేత్త ప్రిన్స్‌ తులిని 2008లో యుక్త ముఖీ, వివాహం చేసుకుంది.  వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు  అయితే, కొన్నేళ్ల పాటు భర్త చేతిలో అసహజ లైంగిక వాంఛలతో, చిత్రహింసలకు గురైన యుక్తా ముఖి 2013లో భర్త , అత్తింటి వారిపై సదరు సెక్షన్ల ప్రకారం క్రిమినల్‌ కేసు పెట్టింది.  చివరికి 2014లో ఈ దంపతులు పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.  

సినీ రంగం నుంచి దూరమైన తర్వాత, ప్రస్తుతం 48 ఏళ్ల వయసులో యుక్త ముఖీ సామాజిక సేవలో నిమగ్నమైంది.  ఎయిడ్స్‌ బాధితులు, థలసీమియా,  బ్రెస్ట్‌ క్యాన్సర్‌ బాధితుల కోసం పనిచేస్తోంది.  అలాగే అవయవదానాన్ని ప్రోత్సహిస్తూ, మరోవైపు బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా పనిచేస్తోంది.  మురికివాడల్లోని  బాలికలకు ఆరోగ్యం, శారీరక అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

Advertisement
 
Advertisement
Advertisement