టాలీవుడ్ ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునను ప్రశంసిస్తూ.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ట్వీట్ చేశారు. నాగార్జున నటించిన శివ సినిమా నేడు రీరిలీజ్ కానున్నడంతో మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు సినీ చరిత్రలో ‘శివ’ ఒక కల్ట్ క్లాసిక్ అని తెలిసిందే. అత్యాధునిక హంగులతో, 4కె విజువల్స్‌తో మరోసారి ప్రేక్షకులకు ముందుకు వచ్చేసింది. దీంతో ఇప్పటికే చిరంజీవి, రాజమౌళి, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్స్ కూడా శివ గురించి తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలా చెప్పుకొచ్చారు.
'ప్రియమైన నాగార్జున.. శివ తెలుగు సినిమాను పునర్నిర్వచింది. ఒక నటుడిగా ఇందులో మీరు ఎంతో గొప్పగా మెప్పించారు. మిమ్మల్ని మరోకరు అందుకోలేరు. ANR గారి వారసత్వాన్ని కొనసాగిస్తూ.. సినిమా పరిశ్రమ పట్ల మీ నిబద్ధత నిజంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. శివ సినిమా రీరిలీజ్ సందర్భంగా, మీకు నా శుభాకాంక్షలు. శివ నుంచి అన్నమయ్య, షిర్డీ సాయితో పాటు నాకు ఎంతో ఇష్టమైన భక్త రామదాసు వంటి దివ్యమైన చిత్రాలతో మీ ప్రయాణం తరతరాలను ప్రభావితం చేస్తూనే ఉంటుంది. శివ మరోసారి గొప్ప విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను.' అని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ట్యాగ్ చేస్తూ నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు. ' మీ స్ఫూర్తిదాయకమైన మాటలు, శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు..!! దయచేసి మీకు సమయం దొరికినప్పుడు సినిమా చూడండి.' అంటూ తెలిపారు.


