ఇండియన్‌ –2లో మనీషా కొయిరాలా.. ఈ సీక్రెట్‌ ఏంటి..? | Manisha Koirala Important Role In Indian 2 Movie, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఇండియన్‌ –2లో మనీషా కొయిరాలా.. ఈ సీక్రెట్‌ ఏంటి..?

Jun 11 2024 6:55 AM | Updated on Jun 11 2024 10:29 AM

Manisha Koirala Important Role In Indian 2 Movie

నటి మనీషా కొయిరాలా నేపాల్‌ మాజీ ప్రధాన మంత్రి బిశ్వేశ్వర్‌ ప్రసాద్‌ కొయిరాలా మనవరాలు. నే పాలీ చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ఆ తరువాత హిందీ, తమిళం, తెలుగు, ఆంగ్లం భాషల్లో నటించి పా పులర్‌ అయ్యారు. ముఖ్యంగా తమిళంలో ఇండియన్‌, బొంబాయి, బాబా వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా రాణించారు. 

కమలహాసన్‌ కథానాయకుడిగా శంకర్‌ దర్శకత్వంలో ఏఎం.రత్నం నిర్మించిన చిత్రం ఇండియన్‌. కమలహాసన్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన అందులో తండ్రి సరసన నటి సుకన్య నటించగా, కొడుకుకు జంటగా నటి మనీషాకొయిరాలా, ఊర్మిళా నటించారు. కాగా 1996లో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కాగా 28 ఏళ్ల తరువాత ఇప్పుడు ఇండియన్‌ చిత్రానికి సీక్వెల్‌ రూపొంది జూలై 12వ తేదీన తెరపైకి రానుంది. ఇందులో కమలహాసన్‌ సేనాపతిగా నటించగా, సిద్ధార్ధ్‌, నటి కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ప్రియాభవానీ శంకర్‌ తదితరులు నటించారు.

 

అయితే ఇందులో నటి మనీషా కోయిరాలా నటించిన విషయాన్ని రహస్యంగా ఉంచడం విశేషం. కాగా ఇటీవల ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేశారు. అందులో నటి మనీషాకోయిరాలా ఫొటో చోటుచేసుకుని ఉండడంతో ఈమె కూడా ఇండియన్‌ –2 చిత్రంలో నటించిన విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ చిత్రంలో 53 ఏళ్ల మనీషాకొయిరాలా ఎలాంటి పాత్రలో కనిపించనున్నారన్నదే ప్రస్తుతం ఆసక్తిగా మారింది. ఆ మధ్య క్యాన్సర్‌ వ్యాధికి గురైన ఈమె దానితో పోరాడి గెలిచిన విషయం తెలిసిందే. 

మనీషాకొయిరాలా చివరిగా తమిళంలో ధనుష్‌ కథానాయకుడిగా నటించిన మాప్పిళై చిత్రంలో ఆయనకు అత్తగా నటించారు.  మెగాస్టార్‌ చిరంజీవి నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రానికి ఇది రీమేక్‌గా 2011లో విడుదలైంది. హీరామండి వెబ్‌ సీరిస్‌లో మనీషా నటనకు ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement