
ఆపరేషన్ సిందూర్ గురించి మలయాళ నటి చేసిన కామెంట్ విమర్శలకు దారి తీస్తుంది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడి చేసింది. అందులో సుమారు 100 మందికి పైగానే ఉగ్రవాదులు మరణించారు. దీంతో సోషల్ మీడియా అంతా భారత సైన్యానికి జేజేలు పలికింది. ‘భారత్ మాతా కీ జై’ అంటూ తాము ఆర్మీ వెంటే అంటూ నెటిజన్‌లు, ప్రముఖులు పోస్ట్‌లు పెట్టారు. అయితే, కేరళకు చెందిన నటి అమీనా నిజమ్.. ఆపరేషన్ సిందూర్ కోసం భారతదేశం 'సిగ్గుపడుతుందని' పోస్ట్ చేసింది.
అమీనా తన సోషల్‌మీడియాలో ఇలా రాసుకొచ్చింది 'ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్‌లోని ప్రజలను చంపడంపై నేను సిగ్గు పడుతున్నాను. చంపుకోవడం ఒక్కటే మార్గం కాదు. దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారిపోతుంది. యుద్దం శాంతిని తీసుకురాదు, ప్రాణాలను తీస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి పరిణామాన్ని ఎవరూ సపోర్ట్ చేయకండి. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని భావించే వ్యక్తులను మోసగిస్తున్నారు. మనం చేస్తున్న యుద్ధం వల్ల నష్టపోయేది పౌరులే. నేను నా ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే భారతీయురాలిని, అహం దెబ్బతిన్నప్పుడు మాత్రమే మాట్లాడేదానిని కాదు.' అంటూ ఆమె షేర్ చేసింది.

నటి అమీనాపై నెటిజన్లు ఒక్కసారిగా విరుచుకు పడ్డారు.. అదే పాకిస్తాన్ ఉగ్రవాదుల చేతిలో అమాయకులైన ఇండియన్స్ కూడా చనిపోయారనే విషయం మీకు గుర్తుచేయాలా..? అంటూ ఫైర్ అవుతున్నారు. ఆమెను దేశ వ్యతిరేకి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి టైమ్‌లో పాకిస్తాన్ ఉగ్రవాదులను పాపం అనడం, వారిపై సానుభూతి చూపించడం ఏ మాత్రం మెచ్చుకోదగ్గ విషయం కాదని ఇది మీ కెరీర్‌కు కూడా అంత మంచిది కాదంటూ చిన్నపాటి వార్నింగ్‌లు కూడా నెటిజన్లు ఇస్తున్నారు.
ఎవరీ అమీనా..?
అమీనా నిజమ్ కేరళకు చెందిన నటి, ఆమె ప్రముఖ మలయాళ టీవీ రియాలిటీ షో అయిన నాయక నాయకన్ ద్వారా పరిశ్రమలో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆమె అనేక సినిమాలతో పాటు పలు షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది. శంకర్ రామకృష్ణన్ దర్శకత్వం వహించిన గ్యాంగ్స్ ఆఫ్ 18 (2018) సినిమాతో అలరించింది. ఆ తర్వాత ఆమె పతినేట్టం పడి, అంజామ్ పాతిర, పట్టాపాకల్, టర్కిష్ తర్కం, టర్బో వంటి సినిమాల్లో నటించింది.