
సినిమా పరిశ్రమలో తనకు అనిపించింది మాట్లాడడానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి గట్స్ ఉన్న అతి కొద్ది మంది నటీమణుల్లో మాళవిక మోహన్(Malavika Mohanan) ఒకరు. 2013లో 'పట్టం పోలే' అనే మలయాళ చిత్రం ద్వారా నటిగా రంగప్రవేశం చేసిన ఈ బ్యూటీ ఆ తరువాత కన్నడం, హిందీ, తమిళం చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. తాజాగా 'ది రాజాసాబ్' చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. రజనీకాంత్ హీరోగా నటించిన 'పేట' చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ భామ తొలి చిత్రంతోనే పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టి సినీ ప్రముఖల దృష్టిలో పడ్డారు. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్, ధనుష్‌కు జంటగా మారన్, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్ తదితర చిత్రాల్లో నటించి, తానేమిటో నిరూపించుకున్నారు.
ప్రస్తుతం తెలుగు చిత్రం ది రాజాసాబ్‌తోపాటు తమిళంలో కార్తీకి జంటగా 'సర్దార్–2' చిత్రంలోనూ నటిస్తున్నారు. తాను అనుకున్నది నిర్మొహమాటంగా వ్యక్తం చేసే ఈమె ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ.. సినిమా పరిశ్రమలో ఆడ, మగ అనే తారతమ్యం ఉండకూడదన్నారు. అయితే అది ఇక్కడ చాలా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటులకు దొరికే మర్యాద నటీమణులకు ఇక్కడ ఇవ్వరని పేర్కొన్నారు. పారితోషికం విషయంలోనూ సమానత్వం లేదని పేర్కొన్నారు. హీరోలకు పారితోషికం అడిగినంత ఇస్తున్నారనీ, హీరోయిన్లకు మాత్రం తగ్గించి ఇస్తున్నారని పేర్కొన్నారు. ఈ పక్షపాత ధోరణి మారాలన్నారు.
ఇకపోతే సినిమాలో కొందరు నటులు ఉన్నారనీ, వారు మహిళల మధ్య మంచి వారిగా కనపించే ప్రయత్నం చేస్తారన్నారు. అలాంటి మేకవన్నె పులులు సమయం వచ్చినప్పుడు వారి అసలు రంగును బయట పెడతారని అన్నారు. అలా గత 5 ఏళ్లుగా ముఖానికి అందమైన మాస్క్ వేసుకున్న పలువురు నటులను తాను చూశానని పేర్కొన్నారు. వాళ్లంతా బుద్ధిమంతులు అని భావించరాదనీ ఏయే సమయాల్లో నటీమణులతో మంచిగా ఉండాలన్నది వారికి బాగా తెలుసన్నారు. కానీ, కెమెరా వెనుక వారు ఎలా మారుతారు అన్నది తాను కళ్లారా చూశానని నటి మాళవిక మోహన్ పేర్కొన్నారు. ఈ బ్యూటీ ఎప్పుడు ఎక్కడ ఎలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారోగానీ, ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.