‘వారణాసి’ రిలీజ్‌కు ముందు.. మహేశ్‌ బాబు సంచలన నిర్ణయం.. | Mahesh Babu Enters Gaming Industry Release in 2028 | Sakshi
Sakshi News home page

Mahesh Babu - Shortgun Games: మహేశ్‌బాబు కొత్త బిజినెస్‌..

Nov 3 2026 4:34 PM | Updated on Nov 3 2026 5:07 PM

Mahesh Babu Enters Gaming Industry Release in 2028

సూపర్‌స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూనే.. వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో భాగస్వామిగా ఉన్న ఆయన తాజాగా మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టారు. ఈ మేరకు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే  ఈసారి గేమింగ్ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. ముంబైకి చెందిన షార్ట్‌గన్ గేమ్స్ (Shortgun Games) సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడిదారుగా చేరారు. భారతీయ వీడియో గేమ్స్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ భాగస్వామ్యం కుదిరింది.

గేమింగ్ రంగంలోకి..
జీత్ చందన్, విధిత్ మెహతా స్థాపించిన షార్ట్‌గన్ గేమ్స్ సంస్థ ప్రధానంగా పీసీ, కన్సోల్ గేమ్స్ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ప్లేస్టేషన్ 5, ఎక్స్‌బాక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌ల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో గేమ్స్ రూపొందించాలనేది సంస్థ లక్ష్యం దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మహేష్ బాబు సంస్థలో మైనారిటీ వాటా తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆయన ఎంత మొత్తంలో పెట్టారనే విషయాన్ని వెల్లడించనప్పటికీ భారీగానే పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.

2028లో ‘ప్రాజెక్ట్ టేక్‌డౌన్’
ఈ భాగస్వామ్యంలో ప్రధాన ఆకర్షణ ‘ప్రాజెక్ట్ టేక్‌డౌన్’. భవిష్యత్తు ముంబై నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారట. దాదాపు 10 నుంచి 15 గంటల గేమ్‌ప్లే ఉండేలా ప్రణాళిక సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ గేమ్‌ను 2028 చివరి నాటికి విడుదల చేయాలని సంస్థ వ్యవస్థాపకులు లక్ష్యంగా పెట్టుకున్నారని సమాచారం. అమెరికా, యూరప్, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్లను దృష్టిలో పెట్టుకుని ఈ గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నారని సమాచారం. మహేష్ బాబు భాగస్వామ్యంతో సంస్థ తన సాంకేతిక సామర్థ్యాన్ని పెంచుకోవడంతో పాటు సృజనాత్మక నిపుణులను నియమించుకోవాలని భావిస్తోందని తెలుస్తోంది.

అంతర్జాతీయ గుర్తింపు
ప్రస్తుతం భారతదేశంలో మొబైల్ గేమింగ్‌కు మంచి ఆదరణ ఉంది. అయితే పీసీ, కన్సోల్ గేమింగ్‌లోనూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలనే లక్ష్యంతో షార్ట్‌గన్ గేమ్స్ ముందుకు సాగుతోంది. భారతీయ సంస్థలు కూడా ప్రపంచస్థాయి గేమ్స్ రూపొందించగలవని నిరూపించడమే తమ ఉద్దేశమని సంస్థ వ్యవస్థాపకులు చెబుతున్నారు. కాగా మహేష్ బాబు పెట్టుబడితో ఈ సంస్థకు మరింత బలం చేకూరుతుందని భావిస్తున్నారు. మరి ‘ప్రాజెక్ట్ టేక్‌డౌన్’ గేమ్ అంతర్జాతీయ గేమర్లను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సినిమా విషయానికి వస్తే..
సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కీరవాణి సంగీతమందిస్తుండగా.. కేఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలో ‘రణబాలి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?)

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement