
'మహావతార్ నరసింహ' సినిమా వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఎక్కడ చూసిన విజయవంతంగా రన్ అవుతుంది. అయితే, తాజాగా ఈ సినిమా ఓటీటీ ఢీల్ గురించి సోషల్మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సినిమా విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకపోవడంతో ఓటీటీ రైట్స్ ఎవరూ కొనుగొలు చేయలేదు. కానీ, ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదుచేయడంతో ఓటీటీ సంస్థలు చాలా వరకు మహావతార్ నరసింహా సినిమా కోసం పోటీ పడుతున్నాయి.
'మహావతార్ నరసింహ' ఓటీటీ రైట్స్ కోసం చాలా సంస్థలు పోటీ పడుతున్నప్పటికీ జియోహాట్స్టార్కు దక్కే ఛాన్స్ ఎక్కువ ఉన్నట్లు బాలీవుడ్లో కథనాలు వచ్చాయి. ఈ చిత్ర నిర్మాణ సంస్థలతో ఉన్న పరిచయాలను బట్టి వారికే ఈ అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, సుమారు రూ. 50 కోట్లకు పైగానే ఈ ఢీల్ ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో తెలుగు, తమిళ్, కన్నడ వంటి రీజనల్ ఓటీటీ సంస్థలలో కూడా మహావతార్ నరసింహా స్ట్రీమింగ్కు రావచ్చని సమాచారం. దీంతో హాట్స్టార్కు మంచి లాభాలే రావచ్చని ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి.
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా 'మహావతార్ నరసింహ' యానిమేటెడ్ చిత్రాన్ని తెరకెక్కించారు. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో మరిన్ని స్క్రీన్స్ పెంచుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే రూ. 105 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌తో ఈ చిత్రం సత్తా చాటుతుంది.