ఒకప్పుడు సినిమాలు అంటే సెంచరీలు కొట్టేవి. హాఫ్ సెంచరీతో మొదలై డబుల్ సెంచరీలు కొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. ఇదేంటి సినిమాల గురించి చెబుతూ క్రికెట్‌తో పోలుస్తున్నారని మీకనిపిస్తోందా? నేను చెప్పేదాంట్లో వింతేముంది.. సెంచరీ అనే పదం అందరికీ తెలిసిందే. క్రికెట్‌లో వంద రన్స్ చేస్తే సెంచరీ కొట్టినట్లే. మరి సినిమాల్లో సెంచరీ అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఈ రోజుల్లో కొట్టమనేది ఇక అసాధ్యమే.
ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్లాక్‌బస్టర్ హిట్ అయినా సినిమా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద ఆడిందంటే గొప్పే. వారం రోజులు దాటిందంటే చాలు.. రిలీజైన చిత్రాలు థియేటర్లలో కనిపించడం లేదు. అవీ చిన్నా, పెద్దా అనే తేడా లేకుండానే కనుమరుగువుతున్నాయి. ఈ రోజుల్లో ఎంత హిట్ సినిమా అయినా కూడా నెల రోజులు బాక్సాఫీస్ వద్ద నిలవడం కూడా గగనమే అన్నట్లుంది పరిస్థితి. ఇటీవల రిలీజైన కాంతార చాప్టర్-1 సూపర్ హిట్‌గా నిలిచినా నెల రోజుల్లోపే ఓటీటీకి వచ్చేసింది. అలాంటి ఈ రోజుల్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే మీరు నమ్ముతారా? నమ్మరు కాక నమ్మరు. కానీ ఇప్పుడు తప్పకుండా నమ్మాల్సిందే. అదేంటో మీరు కూడా చదివేయండి.
ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మూవీ మహావతార్ నరసింహా. పాన్ ఇండియా రేంజ్‌లో జులై 25న విడుదలైన ఈ యానిమేషన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. మొదటి రోజు నుంచి అద్భుతమైన స్పందన రావడంతో అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అంతేకాకుండా రిలీజై 50 రోజులు పూర్తయినా కూడా 200 థియేటర్స్ పైగానే ఈ సినిమాను ప్రదర్శించారు.
ఈ చిత్రం ఏకంగా ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. ఏకంగా థియేటర్లలో సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసింది ఈ యానిమేషన్ మూవీ. ఈ విషయాన్ని హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. 100 రోజుల కీర్తి.. ఇది ఒక తిరుగులేని గాథ.. మహావతార్ నరసింహ బాక్సాఫీస్ చరిత్రను తిరిగి రాస్తూ గర్జిస్తున్నాడు అంటూ పోస్ట్ చేసింది. ఈ ప్రయాణంలో భాగమైనందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసింది.
అయితే ఈ రోజుల్లో వంద రోజులు బాక్సాఫీస్ వద్ద నిలిచిందంటే మామూలు విషయం కాదు. భారీ చిత్రాలు సైతం నెల రోజులకే కనుమరుగవుతున్న తరుణంలో బాక్సాఫీస్ వద్ద సెంచరీ కొట్టడం నిజంగా అద్భుతమనే చెప్పాలి. కాగా.. ఈ మూవీని అశ్విన్ కుమార్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో శిల్పా ధవాన్, కుశల్ దేశాయ్, చైతన్య దేశాయ్ సంయుక్తంగా తెరకెక్కించారు.
100 DAYS of glory. One unstoppable saga! 🔥#MahavatarNarasimha roars on, rewriting box-office history.
Eternally grateful to our amazing audience for being part of this divine journey. 🙏🏻❤️#Mahavatar @hombalefilms @VKiragandur @ChaluveG @kleemproduction @shilpaadhawan… pic.twitter.com/yZcsyCazkw— Hombale Films (@hombalefilms) November 1, 2025


