దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోతున్న సినిమా 'ధురంధర్'. పేరుకే హిందీ మూవీ గానీ దక్షిణాదిలోనూ మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అయితే రిలీజై రెండున్నర వారాలు దాటిపోయినా సరే ఇప్పటికీ ఈ మూవీ తెలుగు డబ్బింగ్ గురించి అస్సలు సౌండ్ లేదు. ఇంతకీ మన దగ్గర రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకింత ఆలస్యం చేస్తున్నారు?
పాన్ ఇండియా ట్రెండ్ పెరిగిన తర్వాత బాలీవుడ్ చిత్రాల్ని కూడా తెలుగులో అప్పుడప్పుడు డబ్ చేసి వదులుతున్నారు. షారుఖ్, సల్మాన్, ఆమిర్ మూవీస్ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు డబ్బింగ్ కూడా ఒకేసారి రిలీజ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వీటిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నవి తక్కువే. కొన్ని సినిమాల విషయంలో తెలుగు ప్రేక్షకులు చాలా ఫీలవుతుంటారు.
(ఇదీ చదవండి: మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ)
ఈ ఏడాది ఫిబ్రవరిలో విక్కీ కౌశల్ 'ఛావా' మూవీ రిలీజైంది. తొలుత హిందీలో తీసుకొచ్చినప్పటికీ.. కాస్త ఆలస్యంగా అయినా సరే తెలుగులో రిలీజ్ చేశారు. తొలి వారం దాటేలోపే ఇది చేసి ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ మరింత రీచ్ ఉండేదనేది చాలామంది అభిప్రాయం. దీని విషయంలో చేసిన తప్పే ఇప్పుడు 'ధురంధర్' విషయంలోనూ మేకర్స్ చేస్తున్నారు. ఈ నెల 5న థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్'.. బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. చాలామంది తెలుగు మూవీ లవర్స్ దీన్ని ఒరిజనల్ వెర్షన్ చూసేశారు. మిగిలిన వాళ్లలో చాలామంది మాత్రం తెలుగు డబ్బింగ్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
గత శుక్రవారమే(డిసెంబరు 19) ఇది తెలుగులో రిలీజ్ అయిపోతుందని సోషల్ మీడియాలో చాలా హడావుడి నడిచింది. తీరా చూస్తే అది రూమర్ అని తేలిపోయింది. ఈ వారమూ వచ్చే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే ఛాంపియన్, దండోరా, శంబాల, వృషభ, పతంగ్, ఈషా, బ్యాడ్ గర్ల్జ్, మార్క్.. ఇలా లైన్‌లో చాలానే థియేటర్ మూవీస్ ఉన్నాయి. వీటితో పాటు వస్తే 'ధురంధర్'కి స్పేస్ దొరకడం కష్టం.
మైత్రీ మూవీ మేకర్స్.. 'ధురంధర్' తెలుగు డబ్బింగ్‌ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఇందుకోసం జనవరి 1వ తేదీని చూస్తున్నారట. ఇది నిజమా అబద్ధమా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది కూడా జరగకపోతే మాత్రం తెలుగు ఆడియెన్స్.. ఓటీటీలోకి వచ్చాక చూసుకోవాల్సిందే. ఈ చిత్ర డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. జనవరి 30 నుంచి స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
(ఇదీ చదవండి: టికెట్ రేట్లు.. వైఎస్ జగనే బెటర్ అంటున్నారు: తెలుగు డైరెక్టర్)


