సీనియర్ నటి పావలా శ్యామల కూతురికి మా అండగా నిలిచింది. తల్లి మరణంతో ఒంటరైన ఆమె కూతురు మాధవి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సాయం చేసేందుకు ముందుకొచ్చింది. తీవ్ర అనారోగ్యం, నిస్సహాయ స్థితిలో ఆమెకు సహాయ, సహకారాలు అందిస్తామని మా ప్రకటించింది. మా అధ్యక్షుడు మంచు విష్ణు నేతృత్వంలో సమావేశమైన ఈసీ కమిటీ మాధవికి సంబంధించి పలు నిర్ణయాలు వెల్లడించింది.
ఆమెకు ఏడాది పాటు ఉచిత వైద్యం, ఫిజియోథెరపీ అందించేందుకు నిర్ణయించింది. ప్రస్తుతం నడవలేని స్థితిలో వీల్ ఛైర్‌కే పరిమితమైన మాధవి తిరిగి తన కాళ్లపై నిలబడేలా, ఎంత ఖర్చైనా ఒక సంవత్సరం పాటు పూర్తి ఉచిత వైద్య సహాయంతో పాటు ఫిజియోథెరపీ అందించాలని 'మా' కీలక నిర్ణయం తీసుకుంది. మా అసోసియేషన్ బైలాస్ ప్రకారం ఆర్టిస్టుల కుటుంబ సభ్యులను జీవితాంతం పోషించడం సాధ్యపడదని.. అందుకే ఈ వైద్య సాయాన్ని ఒక ఏడాదికే పరిమితం చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత ఆమె ఇష్టప్రకారం సురక్షితమైన ఆశ్రమం, పునరావాస కేంద్రంలో చేర్పించనున్నారు. కాగా. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యతలను మా దగ్గరుండి జరిపించగా.. మాధవి భవిష్యత్తు అవసరాల కోసం మురళీమోహన్, వీకే నరేశ్ లాంటి సీనియర్ నటులు ఆర్థిక సహాయం ప్రకటించారు.


