వెండితెర వినాయకుడు | Vinayaka Chavithi Special: Iconic Vinayaka Songs That Ruled the Silver Screen | Sakshi
Sakshi News home page

వెండితెర వినాయకుడు

Sep 14 2026 3:15 AM | Updated on Sep 14 2026 3:15 AM

Vinayaka Chavithi Special: Iconic Vinayaka Songs That Ruled the Silver Screen

గణ నాయకుడు ఘనంగా వచ్చేశాడు. ఎక్కడ చూసినా ఈ నాయకుడి పూజకు వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ గణేశుడు వెండితెరపైకి కూడా నాయకుడిగా వచ్చాడు. వినాయకుడిపై పలు చిత్రాల్లో వచ్చిన పాపులర్‌ పాటలు కూడా చాలా ఉన్నాయి. ఈ వినాయక చవితి సందర్భంగా వెండితెర వి‘నాయకుడు’, పాటల గురించి తెలుసుకుందాం. 

వినాయక చవితి (1957) 
శమంతకోపాఖ్యానం నేపథ్యంలో దర్శకుడు సముద్రాల రాఘవాచార్య తెరకెక్కించిన చిత్రం ‘వినాయక చవితి’. ఎన్టీఆర్, జమున, కృష్ణకుమారి, గుమ్మడి తదితరులు ప్రధాన తారలుగా నటించారు. ఈ సినిమా కథ విషయానికి వస్తే... వినాయక చవితి నాడు శ్రీకృష్ణు్ణడు పాలలో చంద్రుడిని చూస్తాడు. దీంతో శమంతక మణిని దొంగలించాడనే అపవాదు పడుతుంది. వినాయక వ్రతం చేసి కృష్ణుడు ఆ అపవాదు నుంచి ఎలా బయటపడ్డాడనేది ఈ సినిమాలో చూపించారు. వినాయకుడిని పూజించే సంప్రదాయం వెనక ఉన్న పురాణ విశ్వాసాలను గుర్తు చేస్తూ సాగిన ఈ చిత్రం ప్రేక్షకులకు చక్కని ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది. 

శ్రీ వినాయక విజయము (1979) 
వినాయకుని జన్మ వృత్తాంతంతో రూపొందిన అద్భుత చిత్రం ‘శ్రీ వినాయక విజయము’. శివపార్వతులుగా కృష్ణంరాజు, వాణిశ్రీ, గణేశుడిగా ఎంజీవీ మదన్‌గోపాల్‌ నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. స్నానానికి వెళ్లేటప్పుడు నలుగు పిండితో బాలుణ్ణి చేసి, గుమ్మం దగ్గర కాపలాగా పెడుతుంది పార్వతీ దేవి. ఆ బాలుడు గుమ్మం దగ్గర నిలబడి ఎవర్నీ లోపలికి రానివ్వడు. అయితే స్వయంగా పరమశివుడే రావడం, ఆయన్ను కూడా ఈ బాలుడు అడ్డుకోవడం, ఆ తర్వాత అతని తలకి ఏనుగు తల రావడం... ఆ బాలుడు గణపతిగా మారడం, గణాధిపతిగా ఆయనకు స్థానం లభించడం,  మూషికాసురుని సంహారం వంటి ఘట్టాలతో ‘శ్రీ వినాయక విజయము’ రూపొందింది.  

దేవుళ్ళు (2000) 
కోడిరామకృష్ణ తెరకెక్కించిన సూపర్‌హిట్‌ సినిమా ‘దేవుళ్ళు’. పృథ్వీరాజ్, రాశీ, మాస్టర్‌ నందన్, బేబీ నిత్య లీడ్‌ రోల్స్‌లో నటించిన ఈ ఆధ్యాత్మిక చిత్రానికి మంచి ఆదరణ లభించింది. కథ రీత్యా... విడాకులు తీసు కోవాలనుకుంటున్న తమ తల్లిదండ్రులను (పృథ్వీ, రాశీ) తిరిగి ఒక్కటి చేయాలనే సంకల్పంతో ఇద్దరు పిల్లలు (నందన్, బేబీ) వారి నానమ్మ మొక్కులను నెరవేర్చడానికి ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు.

 విఘ్న నివారకుడైన కాణిపాక వినాయకుని దర్శనంతోనే ఈ ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు. ఈ చిత్రంలో వినాయక స్వామి నేపథ్యాన్ని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ప్రాశస్త్యంతో ముడిపెట్టారు కోడి రామకృష్ణ. భక్తుల ఇష్ట కామ్యాలను తీర్చే కాణిపాక గణపతి లీలలను చూపించారు. ‘దేవుళ్ళు’ సినిమాలో వచ్చే ఈ వినాయక స్వామి ఎపిసోడ్‌ కథకు కీలకంగా ఉంటుంది. ఈ చిత్రంలో వినాయకుడి పాత్రలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చక్కగా ఒదిగిపోయారు.
ఇలా చెప్పుకుంటే ‘వినాయకుడు’ ప్రధానాంశంగా, వినాయకుడి ప్రస్తావన ఉన్న చిత్రాలు చాలా ఉన్నాయి.  

సినిమాల్లో వినాయకుడి పాటలు 
ఎన్టీఆర్, కృష్ణ హీరోలుగా నటించిన ‘దేవుడు చేసిన మనుషుల్లారా..’ (1973) సినిమాలోని ‘దేవుడు చేసిన మనుషుల్లారా.. మనుషులు చేసిన దేవుళ్లారా.. పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలో ఉంటుంది. వెంకటేశ్‌ ‘కూలీ నెం.1’ (1991)లో ‘దండాలయ్యా ఉండ్రాళ్ళయ్యా... దయుంచయ్యా దేవా.. పాట వినాయక చవితి పండగ మండపాల్లో వినిపించకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ‘దేవుళ్లు’ (2000) లోని ‘జయ జయ శుభకర వినాయకా... శ్రీ కాణిపాక వర సిద్ధి వినాయకా... పాట చాలా పాపులర్‌. 

చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ (2005) చిత్రంలో ‘జై జై గణేశా.. జై కొడత గణేశా.. జయములివ్వు బొజ్జ గణేశా.. పాట బాగా పాపులర్‌. మహేశ్‌బాబు ‘పోకిరి’ (2006) లోని ‘జగడమే.. పాటలో బిట్‌ సాంగ్‌లా వినిపించే ‘గణపతి బ΄్పా మోరియా..’ మాస్‌ లెవల్లో ఉంటుంది. రామ్‌ ‘గణేష్‌’ (2009) చిత్రంలోని ‘రాజా మహరాజా’ వినాయకుడి పాటగానే వినిపిస్తుంది. బాలకృష్ణ ‘డిక్టేటర్‌’ (2016)లో ‘గం గం గం గం గం గం గణేశా... గౌరీ తనయా సర్వేశా... పాట గణనాథుణ్ణి కీర్తిస్తుంది. 

నాగార్జున, నాని హీరోలుగా నటించిన ‘దేవదాస్‌’ (2018)లో ‘లక లక లకుమీకర లంబోదర... జగజగ జగదోద్ధార విఘ్నేశ్వర’ అని సాగే పాట ఉంది. ‘ఏడాదికోసారి మాకై దిగి రారా... లోకంలో లోపాలు పాపాలన్నీ తుడిచెయ్‌రా... వెళుతూ వెళుతూ అట్టా గంగమ్మలో కలిపెయ్‌రా’ అంటూ సాగే ఈ పాట వినాయక నిమజ్జనం నేపథ్యంలోనే ఉంటుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement