ఓటీటీలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. వెళ్తుంటాయి. కానీ కొన్ని చిత్రాలు మాత్రం ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తాయి. అందులోని పాత్రలు కూడా చాలాకాలం గుర్తుండిపోతాయి. ముఖ్యంగా కొన్ని పాత్రలు ప్రేక్షకులను నవ్విస్తే.. మరికొన్ని కంటతడి పెట్టిస్తాయి. అలా తన నటనతో ప్రేక్షకుల హృదయాలను కదిలించే నటీమణుల్లో లిజి మోల్ జోస్ ఒకరు. పెద్దగా పరిచయం లేని పాత్రల్లో కనిపించినా.. తన సహజమైన నటనతో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడం ఆమె ప్రత్యేకత. అందుకే జై భీమ్ నుంచి బత్తా వరకు ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
ప్రతి భావాన్ని ఎంతో సహజంగా
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో లిజి మోల్ జోస్ సెంగేని రాజకన్నుగా కనిపించారు. తన భర్త కోసం న్యాయపోరాటం చేసే ఓ మహిళగా ఆమె నటన ప్రేక్షకులను కదిలించింది. ముఖ్యంగా భర్తను కోల్పోయిన బాధ, తన కుటుంబానికి జరిగిన అన్యాయం, న్యాయం కోసం ఆమె పడే తపన.. ఇలా ప్రతి భావాన్ని ఎంతో సహజంగా పలికించారు.
ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘బత్తా’ సినిమాలోనూ కన్నిమాగా కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలోనూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కథకు అవసరమైన భావోద్వేగాలను తన నటనతో అందిస్తూ.. సినిమాలో తన పాత్రకు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. జై భీమ్‌లో సెంగేని పాత్రను చూసిన ప్రేక్షకులు.. బత్తాలో ఆమెను మరో కోణంలో చూసి ఆశ్చర్యపోతున్నారనడంలో సందేహం లేదు.
లిజోమోల్ జోస్ విషయానికి వస్తే..
లిజోమోల్ జోస్ విషయానికి వస్తే.. ప్రధానంగా మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. 2016లో ‘మహేశింటే ప్రతీకారం’ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. 2021లో విడుదలైన తమిళ చిత్రం ‘జై భీమ్’లో సెంగేని పాత్రతో విశేష గుర్తింపు పొందారు. ఈ సినిమాలో ఆమె నటనకు ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు. ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన బత్తా సినిమాతో మరోసారి గుర్తింపు తెచ్చుకున్నారు.
(ఇదీ చదవండి: ఓటీటీకి వచ్చిన లేటెస్ట్ సెన్సేషన్ 'బత్తా'.. ఎలా ఉందంటే?)


