
ఆదిపురుష్ మూవీతో టాలీవుడ్లో అభిమానులను సంపాదించుకున్న బ్యూటీ కృతి సనన్. ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా కోలీవుడ్ స్టార్ ధనుశ్‌తో కలిసి తేరే ఇష్క్ మే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రం నవంబర్ 28న రిలీజ్ కానుంది. ఆ తర్వాత బాలీవుడ్ మూవీ కాక్టెయిల్-2లోనూ నటిస్తోంది. సినిమాలతో పాటు వ్యాపార రంగంలోనూ కృతి రాణిస్తోంది. 2023లో తన సొంత బ్యూటీ బ్రాండ్ హైఫన్ ప్రారంభించింది. స్కిన్ కేర్‌కు సంబంధించిన వ్యాపారంలో దూసుకెళ్తోంది. నటనతో పాటు 2022లోనే వ్యాయామ కార్యక్రమాలు, శిక్షణ, వెల్‌నెస్ కంటెంట్ను అందించే ఫిట్‌నెస్ బ్రాండ్ ది ట్రైబ్‌ను స్థాపించింది.
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ముంబయిలోని బాంద్రా వెస్ట్‌లోని పాలి హిల్ ప్రాంతంలో డ్యూప్లెక్స్ పెంట్హౌస్ను కొనేసింది బాలీవుడ్ భామ. ఈ లగ్జరీ ఫ్లాట్ కోసం రూ.84.16 కోట్లకు పైగా చెల్లించినట్లు సమాచారం. ఇప్పటికే కృతికి ముంబయి సమీపంలో అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న ఫ్లాట్ను కొనుగోలు చేసింది. అంతకుముందే బాంద్రాలోనే దాదాపు రూ.35 కోట్ల విలువైన 4 బీహెచ్కే అపార్ట్మెంట్ను తన సొంతం చేసుకుంది.
ఈ ఖరీదైన బాంద్రా వెస్ట్ ప్రాంతంలో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, జావేద్ అక్తర్, రణబీర్ కపూర్, అలియా భట్, కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్, రేఖ వంటి బాలీవుడ్ ప్రముఖులు నివాసముంటున్నారు. బాలీవుడ్ కపుల్ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ కూడా త్వరలో తమ కొత్త బాంద్రా వెస్ట్ అపార్ట్‌మెంట్‌లోకి మారనున్నారు.