కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలో నటించిన క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ 'రివాల్వర్ రీటా'. ఈ మూవీకి జేకే చంద్రు దర్శకత్వం వహించారు. లేజీ ఓరియంటెండ్ స్టోరీగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్ సుధన్ సుందరమ్, రూట్స్ ప్రొడక్షన్స్ జగదీశ్ పళనిస్వామి కలిసి నిర్మించారు. నవంబర్ 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది.
తాజాగా ఈ మూవీ ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈనెల 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంటుందని పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రంలో రాధికా శరత్‌కుమార్, సూపర్ సుబ్బరాయన్, సునీల్, అజయ్ ఘోష్, రెడిన్ కింగ్స్లీ కీలక పాత్రలు పోషించారు.
రివాల్వర్ రీటా కథేంటంటే..
పాండిచ్చేరికి చెందిన రీటా(కీర్తి సురేశ్) నాన్న చిన్నప్పుడే ల్యాండ్ విషయంలో ఓ గ్యాంగ్‌స్టర్ చేసిన మోసాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. ఓ బేకరీలో పని చేస్తూ తన తల్లి చెల్లమ్మ(రాధిక శరత్‌కుమార్), ఇద్దరు సిస్టర్స్‌తో కలిసి జీవితాన్ని కొనసాగిస్తుంది. తన అక్క కూతురు తొలి పుట్టిన రోజును జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఇంట్లోకి పాండిచ్చేరిలోనే పేరుమోసిన గ్యాంగ్‌స్టర్ పాండ్యన్(సూపర్ సుబ్బరాయన్) వస్తాడు. తాగిన మత్తులో దారితప్పి వచ్చిన ఆ గ్యాంగ్‌స్టర్‌తో రీటా ఫ్యామిలీకి చిన్న గొడవ జరుగుతుంది. మాట మాట పెరిగి.. రీటా తల్లి అతన్ని కిందకు తోసేయ్యగా.. తలకు గట్టిదెబ్బ తగిలి చనిపోతాడు. ఈ విషయం తెలిస్తే పాండ్య కొడుకు బాబీ(సునీల్)..కచ్చితంగా తమల్ని చంపేస్తాడనే భయంలో శవాన్ని ఇంట్లోనే దాచి.. బర్త్‌డేని సెలెబ్రేట్ చేస్తారు.
మరుసటి రోజు ఓ కారులో ఆ శవాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తారు. ఇంతలోనే తండ్రి ఇంట్లో లేడనే విషయం బాబీకి తెలిసి..తనదైన శైలీలో వెతుకుతుంటాడు. మరోవైపు పాండ్య శవాన్ని రీటా ఇంటి నుంచి దొంగిలించి.. మరో డాన్ నర్సిరెడ్డి(అజయ్ గోష్) అప్పగించి రూ. 5 కోట్లు తీసుకోవాలి ఓ గ్యాంగ్ ప్రయత్నిస్తుంటుంది. అదే సమయంలో రీటాపై పగ పెంచుకున్న సీఐ(జాన్ విజయ్)కి.. ఆమె ఓ కారుని దొంగతనంగా కొనుగోలు చేసిందనే విషయం తెలిసి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇద్దరు గ్యాంగ్‌స్టర్స్, పోలీసుల మధ్య నుంచి రీటా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నది అనేదే ఈ సినిమా కథ.
Watch Revolver Rita on Netflix out 26 December in Tamil, Telugu, Kannada and Malayalam#RevolverRitaOnNetflix@KeerthyOfficial @Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ @TheRoute @RSeanRoldan @dineshkrishnanb @Cinemainmygenes @dhilipaction @mkt_tribe…
— Netflix India South (@Netflix_INSouth) December 21, 2025


