
బాలీవుడ్ బడా దర్శకనిర్మాత కరణ్ జోహార్ (Karan Johar) ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ఆరంభించాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆనాటి సంగతులను నెమరేసుకున్నాడు. కరణ్ జోహార్ మాట్లాడుతూ.. "ఆరోజుల్లో షూటింగ్ చేయడం అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడున్నన్ని ప్రత్యేక విభాగాలు అప్పుడు లేవు. అసిస్టెంట్ డైరెక్టర్సే అన్నీ చూసుకోవాలి! దిల్‌వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాకు నేను సహాయ దర్శకుడిగా పని చేశాను.
అన్ని పనులు ఒక్కరే..
డైలాగులు రాసి నటీనటులకు ఇవ్వడం, వారిని చూసేందుకు వచ్చిన జనాల్ని అదుపు చేయడం మా పని. కొన్నిసార్లు హీరోహీరోయిన్లకు మేకప్‌మ్యాన్ కూడా మేమే అవుతాం. స్విట్జర్లాండ్‌లో సీన్స్ షూట్ చేసేందుకు మొత్తం 21 మందిమి వెళ్లాం. అందరం ఒకే బస్‌లో కూర్చునేవాళ్లం. బస్‌లో వెళ్తుండగా ఎక్కడైనా లొకేషన్ బాగుందనిపించగానే వెంటనే దిగిపోయి షూట్ చేసేవాళ్లం.

హీరోహీరోయిన్లు కూడా..
సరైన వసతులు లేనిచోట హీరోయిన్ కాజోల్ (Kajol) ఓ చెట్టు వెనక్కు వెళ్లి చీర మార్చుకునేది. షారూఖ్ ఖాన్ ఎక్కడపడితే అక్కడే డ్రెస్ మార్చుకుని రెడీ అయ్యేవాడు. ఎత్తైన కొండలపై షూటింగ్ ఉందంటే అందరూ సామాన్లు పట్టుకుని పైకి నడుచుకుంటూ వెళ్లాల్సిందే! షారూఖ్, కాజోల్ కూడా కొంత సామాను పట్టుకుని నడిచేవారు. అందరం ఒక టీమ్‌గా ముందుకు కదిలేవాళ్లం. మాకు సాయం చేయడానికి ఎవరూ ఉండేవారు కాదు. హీరోయిన్ డ్రెస్, జ్యువెలరీ కూడా తక్కువ రేటులో తీసుకునేవాళ్లం.
హీరోయిన్ జుట్టు సరిచేశా
డబ్బు ఎక్కువ లేకపోయేసరికి రైల్వే స్టేషన్ బయట అతి చవకైన ఆభరణాలు కొనుక్కొచ్చేవాడిని. కానీ ఇప్పుడంతా ఎలా మారిపోయిందో చూస్తున్నారుగా.. హీరో వానిటీ వ్యాన్‌లో కనీసం ఎనిమిది మందైనా ఉంటున్నారు. అప్పట్లో మేనేజర్, పీఆర్ అని ఎవరూ లేరు. హీరోయిన్ వెంట ఆమె తల్లి మాత్రమే ఉండేది. ఒకసారి కాజోల్ మేకప్‌మ్యాన్ లేకపోయేసరికి నేనే తన జుట్టు సరి చేశా. ఆమె తల్లి ముఖానికి మేకప్ వేసింది. ఆరోజుల్లో అంతా చాలా సరదాగా ఉండేది, ఇప్పుడంతా బోరింగ్‌గా మారిపోయింది అని కరణ్ జోహార్ చెప్పుకొచ్చాడు.

సినిమా
దిల్‌వాలే దుల్హానియా లేజాయేంగే సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రం 1995లో రిలీజైంది. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించగా యష్ చోప్రా నిర్మించారు. షారూఖ్ ఖాన్, కాజోల్ ప్రధాన పాత్రలు పోషించగా అమ్రిష్ పురి, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటించారు. కరణ్ విషయానికి వస్తే.. ఆయన బ్యానర్‌లో తెరకెక్కిన ధడక్ 2 మూవీ ఆగస్టు 1న విడుదల కానుంది. ఈ చిత్రంలో సిద్దాంత్ చతుర్వేది, తృప్తి డిమ్రి హీరోహీరోయిన్లుగా నటించారు.
చదవండి: సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తా: పుష్ప విలన్