నాలుగంచుల ఖడ్గం

Kangana Ranaut challenge for Mumbai visit - Sakshi

కంగనకు ముంబై రోడ్లు బ్లాక్‌ అయి ఉన్నాయి. లోపలికి రానివ్వం అంటున్నారు శివసైనికులు. ‘క్వీన్‌’లో ఇలాగే ఆమె పెళ్లి బ్లాక్‌ అయిపోతుంది. అప్పుడు ఆత్మాభిమానం అనే ఖడ్గాన్ని తీస్తుంది.  ఇప్పుడూ.. సేమ్‌ అదే.. సెల్ఫ్‌ రెస్పెక్ట్‌ ఆయుధం.  మూవీ మాఫియా.. సోషల్‌ మీడియా... ముంబై పోలీసులు.. స్టార్‌లు, కో–స్టార్‌లు.. వీళ్లందరిపై.. ఒంటరిగా యుద్ధం చేస్తోంది. నాలుగంచుల ఖడ్గంగా రీమేక్‌ అవుతోంది.

 రేపు ముంబై బయల్దేరాలి కంగనా రనౌత్‌. రేపు బయల్దేరితేనే ఎల్లుండికి  ముంబైలో ఉంటారు. ఏమిటి అంత అత్యవసరం? ఆమె చాలెంజ్‌ చేశారు. ‘తొమ్మిదిన ముంబైలో దిగుతున్నాను.. ఎవరు అడ్డుకుంటారో చూస్తాను’ అని. ఆ ఛాలెంజ్‌ మహారాష్ట్ర హోమ్‌ మినిస్టర్‌కి! ‘మూవీ మాఫియా కన్నా డేంజర్‌ ముంబై పోలీసులు అన్నావు కదా. అయితే ముంబై రాకు’ అన్నారాయన. కంగన ఛాలెంజ్‌ శివసేన ఎంపీకి కూడా. ‘ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ అన్నావు కదా.. అయితే నువ్వెలా ముంబైలోకి అడుగుపెడతావో చూస్తాను’ అన్నారు ఆయన. బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ మరణం తర్వాత కంగన చాలామందిని చాలానే అన్నారు. అలా అనడంలో ఒంటరి అయిపోయారు. ఒంటరిగా ఫైట్‌ చేస్తున్నారు. ఇప్పుడూ ఒంటరిగానే మనాలి నుంచి క్యాబ్‌లోనో, బస్‌లోనో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ చేరుకుని అక్కడి నుంచి విమానంలో ముంబై వెళుతున్నారు!

కొన్నాళ్లుగా కంగన హిమాచల్‌ ప్రదేశ్‌లో తను ఇల్లు కట్టుకున్న మనాలిలో తల్లితో కలిసి ఉంటున్నారు. ముంబై చిత్రసీమలోని బంధుప్రీతి మీద, అక్కడి డ్రగ్‌ ముఠాల మీద, మీడియా మాఫిమా మీద, ముంబై పోలీసుల మీద ధైర్యంగా మాట్లాడగలిగిన అమ్మాౖయెతే కాదు కంగన. కానీ మాట్లాడుతున్నారు! ఆ ధైర్యం ముంబై ఇచ్చిందే. అవతలి వ్యక్తిలో తప్పు కనిపిస్తే వచ్చే ధైర్యం అది. ముంబైలో ఒక తప్పు కాదు, వంద తప్పులు కనిపించాయి కంగనకు. ముంబై చేసిన మొదటి తప్పు.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఆమెకు మత్తు మందు ఇచ్చి ఆమెను ఆక్రమించుకోవడం. చివరి తప్పు (ఆమె మనాలి వెళ్లే ముందు వరకు) సుశాంత్‌ ఎలా చనిపోయాడో తెలియనివ్వకుండా చంపేయడం. తక్కిన బయటి తారల్లా ముంబై తనకు సంబంధం లేని విషయం అనుకోవడం లేదు కంగన. ముంబై ఆమెకు ఎంత ఇచ్చిందో కానీ, ఆమె దగ్గర్నుంచి చాలానే తీసేసుకుంది! ముఖ్యంగా ఆమె అమాయకత్వాన్ని. ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్‌’లా ఉన్నారు కంగన. 2014 లో వచ్చిన ఆమె చిత్రం ‘క్వీన్‌’ లోని రాణీ మెహ్రాలా.. కోమలంగా, లాలిత్యంగా.

‘క్వీన్‌’ సినిమాలో సగటు పంజాబీ అమ్మాయి కంగన. ఫ్యామిలీ ఢిల్లీలో ఉంటుంది. తండ్రిది మిఠాయి దుకాణం. పెళ్లికి ఏర్పాట్లు అవుతుండగా అప్పుడు చెబుతాడు ఆమెకు రాజ్‌కుమార్‌రావ్‌.. ‘నీకూ నాకూ అసలేదీ కలవదు.. ఐయామ్‌ సారీ. నేన్నిన్ను పెళ్లి చేసుకోలేను. చేసుకుని నా లైఫ్‌స్టెయిల్‌తో నిన్ను బాధించలేను’ అని! విదేశంలో కొంతకాలం ఉండొస్తాడు అతడు. అదీ స్టెయిల్‌. ఆమె వెంటపడి వెంటపడి ప్రేమించినప్పుడు, ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులను ఒప్పించినప్పుడు, ఆమెకు ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ తొడిగినప్పుడు, పెళ్లయ్యాక హనీమూన్‌కి పారిస్, ఆమ్‌స్టర్‌డ్యామ్‌ టిక్కెట్‌లు బుక్‌ చేసుకున్నప్పుడు అతడికి తన లైఫ్‌స్టెయిల్‌ గుర్తుకు రాదు.

పెళ్లి ఆగిపోతుంది. ఆ షాక్‌ నుంచి తేరుకోడానికి కసిగా.. తనొక్కటే తల్లిదండ్రులను ఒప్పించి ప్యారిస్‌ వెళ్లిపోతుంది కంగన. అక్కడి నుంచి ఆమ్‌స్టర్‌డ్యామ్‌. ఆ కొన్నాళ్ల ఒంటరి జీవితం ఆమెకు అనేక అనుభవాలను ఇస్తుంది. స్వేచ్ఛానుభూతులను మిగులుస్తుంది. ఒక తొలిముద్దును కూడా. ఓరోజు పల్చటి డ్రెస్‌ వేసుకుని తీసుకున్న సెల్ఫీని కంగన పొరపాటున రాజ్‌కుమార్‌ రావ్‌కి షేర్‌ చేస్తుంది. అది చూసి కంగనను వెతుక్కుంటూ ఆమ్‌స్టర్‌డ్యామ్‌ వస్తాడు. సారీ చెప్తాడు. తనను పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేస్తాడు. ‘నువ్వెళ్లు. ఢిల్లీ వచ్చాక కలుస్తాను’ అంటుంది. కళ్లలో ఆశలు పెట్టుకుని, ఆమె కోసం మనసులో దీపాలు వెలిగించుకుని అతడు వెళ్లిపోతాడు. ఢిల్లీలో దిగాక కంగన నేరుగా రాజ్‌కుమార్‌ రావ్‌ ఇంటికి వెళ్లి, హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ని తీసి అతడి చేతిలో పెట్టి, ‘థ్యాంక్యూ’ చెప్పి వచ్చేస్తుంది. ఆమె ముఖంలో పెద్ద రిలీఫ్‌.

‘క్వీన్‌’ చిత్రం మహిళా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రధానంగా అమ్మాయిలు ఆ సినిమాతో ‘రిలేట్‌’ అయ్యారు. ‘రాణిలా చూసుకుంటా..’ అనే మాట వినిపిస్తుంటుంది.. ప్రేమల్లో, పెళ్లిళ్లలో! ఎవరూ చూసుకోనవసరం లేదు. ఆత్మాభిమానమే ఆడపిల్లను రాణిని చేస్తుంది. ఆ ఆత్మాభిమానమే ఇప్పుడు నాలుగు భాషల్లోకి రీమేక్‌ అవుతోంది. తెలుగులో ‘దటీజ్‌ మహాలక్ష్మి’. క్వీన్‌ తమన్నా. తమిళ్‌లో ‘పారిస్‌ పారిస్‌’. క్వీన్‌ కాజల్‌. మలయాళంలో ‘జామ్‌ జామ్‌’. క్వీన్‌ మంజిమ. కన్నడంలో ‘బటర్‌ఫ్లై’. క్వీన్‌ పరుల్‌ యాదవ్‌.  ముగ్గురు వేర్వేరు దర్శకులు రీమేక్‌ చేస్తున్న ఈ నాలుగు సినిమాలను మను కుమరన్‌ ఒక్కరే నిర్మిస్తున్నారు.

ముంబై వచ్చిన కొత్తలో ‘క్వీన్‌’లా కోమలంగా ఉన్నారని కదా అనుకున్నాం కంగన గురించి. ముంబైకి ఎన్ని ముఖాలు ఉన్నాయో అన్ని ముఖాలూ తమ అసలు స్వరూపం చూపించి కంగనని క్రూరమైన రాణిగా రాటుదేల్చాయి. ఇప్పటికీ ఆమే బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం డిమాండ్‌ చేయగల బయటి తార. టాలెంట్‌ ఉంది. దాంతో పాటు ధర్మాగ్రహం ఉంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. నిజాన్ని నిర్భయంగా చెబుతారు. బాలీవుడ్‌ నలు చదరపు బంధుగణాల క్లబ్బులలో ఇమడని నికార్సయిన గుండ్రటి షాంపేన్‌ గ్లాస్‌ కంగనా రనౌత్‌. రాణి వెడలుతున్నారు. చూడాలి.. ముంబైలో బుధవారం రిక్టర్‌ స్కేలు ఎంత చూపిస్తుందో.


తెలుగు క్వీన్‌ ‘దటీజ్‌ మహాలక్ష్మి’లో తమన్నా; తమిళ్‌ క్వీన్‌ ‘పారిస్‌ పారిస్‌’లో కాజల్‌


మలయాళీ క్వీన్‌ ‘జామ్‌ జామ్‌’లో మంజిమ; కన్నడ క్వీన్‌ ‘బటర్‌ ఫ్లై’లో పరుల్‌ యాదవ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top