ఇది వేడుకలకు సమయం కాదు: కమల్‌హాసన్‌ | Kamal Haasan postpones Thug Life audio launch | Sakshi
Sakshi News home page

ఇది వేడుకలకు సమయం కాదు: కమల్‌హాసన్‌

May 10 2025 12:44 AM | Updated on May 10 2025 12:44 AM

Kamal Haasan postpones Thug Life audio launch

కమల్‌హాసన్‌ హీరోగా నటించిన ‘థగ్‌ లైఫ్‌’ సినిమా ఆడియో విడుదల వేడుక వాయిదా పడింది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శింబు, త్రిష, అశోక్‌ సెల్వన్, ఐశ్వర్యా లక్ష్మి, జోజు జార్జ్‌ తదితరులు ఇతర ప్రధానపాత్రలు పోషించారు. కమల్‌హాసన్, మణిరత్నం, ఆర్‌. మహేంద్రన్, శివ అనంత్‌ నిర్మించిన ఈ చిత్రం జూన్‌ 5నపాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగులో శ్రేష్ఠ్‌ మూవీస్‌ రిలీజ్‌ చేస్తోంది. ఈ నెల 16న ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో విడుదల వేడుకని ఘనంగా నిర్వహించాలని చిత్రయూనిట్‌ ప్లాన్‌ చేసింది. 

అయితే ప్రస్తుతం భారత్‌–పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వేడుక వాయిదా వేసినట్లు చిత్రబృందం తెలియజేసింది. ఈ మేరకు ‘ఆర్ట్‌ కెన్‌ వెయిట్‌–ఇండియా కమ్స్‌ ఫస్ట్‌’ అంటూ కమల్‌హాసన్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘మన దేశ సరిహద్దుల్లో చోటు చేసుకున్న పరిణామాలు, ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 16న నిర్వహించాల్సిన ‘థగ్‌ లైఫ్‌’ ఆడియో లాంచ్‌ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నాం.

మన దేశాన్ని రక్షించడంలో మన సైనికులు అప్రతిహత ధైర్యంతో ముందుండిపోరాడుతున్న వేళ వేడుకలకు సమయం కాదని భావిస్తున్నాం. ఇది సంఘీభావానికి సమయం అని నమ్ముతున్నాను. ఈ సమయంలో మన దేశాన్ని కాపాడుతూ అప్రమత్తంగా ఉన్న మన సైనికుల గురించి మనం ఆలోచించాలి. పౌరులుగా మనం సంయమనంతో, సంఘీభావంతో స్పందించాలి. ఆడియో రిలీజ్‌ కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాం’’ అని కమల్‌హాసన్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement