
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ తాజాగా సర్‌జమీన్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రంలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు జంటగా కనిపించింది. దేశభక్తి నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా నేరుగా ఓటీటీలోనే విడుదలైంది. ఈ మూవీలో ఇబ్రహీం అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి కయోజ్ ఇరానీ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో కాజోల్.. మెహర్ అనే పాత్రలో కనిపించారు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన కాజోల్.. అందం, గ్లామర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. సినీ ఇండస్ట్రీలో కాస్మెటిక్ సర్జరీ, బోటాక్స్ గురించి ప్రస్తావించింది. అందం కోసం ఇలాంటి చేయించుకోవడం అనేది వ్యక్తిగత విషయమని పేర్కొంది. అలాంటి వారిని మనం జడ్జ్ చేయకూడదని తెలిపింది. ఆ విషయాన్ని వారికే వదిలేయాలని హితవు పలికింది. కాస్మోటిక్ సర్జరీలు కేవలం మహిళలకు మాత్రమే పరిమితం కాదని.. ఈ రోజుల్లో పురుషులు కూడా చేయించుకుంటున్నారని వెల్లడించింది.
కాజోల్ మాట్లాడుతూ.. 'కత్తి కిందకు వెళ్లాలా, వద్దా అనేది ప్రతి ఒక్కరి వ్యక్తిగత నిర్ణయం. అందుకే ఇలాంటి విషయాలను అది వారికే వదిలివేయాలి. వాటిని మనం ప్రశ్నించకూడదు. ఇది కేవలం జెండర్‌కు సంబంధించినది కాదు. చాలా మంది పురుషులు కూడా చేయించుకుంటున్నారు. ఇప్పుడున్న రోజుల్లో అందరూ సమానమే.. వృద్ధాప్యం అనేది మనస్సుకు సంబంధించిన విషయం. అయితే వృద్ధాప్యాన్ని చేరుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. కొంతమంది చిన్న వయస్సులోనే మరణించడంతో అసలు వృద్ధాప్యం పొందే అవకాశమే లేదు. అలాంటి వారు అదృష్టవంతులని కాదు. అంటే వారికి వృద్ధాప్యాన్ని అనుభవించడానికి, జీవితంలో ముందుకు పోయే ఛాన్స్ లేదు. అందుకే నాకు జీవించడానికి ఇంకా చాలా అద్భుతమైన సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. వాటి కోసమే ఎదురు చూస్తున్నా' అని అన్నారు.