
ఓటీటీలో 'జూనియర్' సినిమా విడుదల గురించి మరోసారి అప్టేడ్ వచ్చింది. ఈనెల 22 నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్లు ఓటీటీ సంస్థ 'ఆహా' ఇప్పటికే ప్రకటించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే, తాజాగా మరోపోస్టర్‌తో కొత్త విడుదల తేదీని ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ నీరక్షణకు తెరపడింది.
'జూనియర్' సినిమా సెప్టెంబర్ 30న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని ఆహా సంస్థ పేర్కొంది. ‘సీనియర్‌కి సెమిస్టర్ పరీక్షలున్నాయి.. అందుకే జూనియర్ ఈ నెల 30న వస్తున్నాడు’ అని సరదాగ ఒక క్యాప్షన్ పెట్టింది. కిరీటి రెడ్డి హీరోగా నటించిన తొలి చిత్రం 'జూనియర్'(Junior Movie). ఇందులో ‘వైరల్ వయ్యారి..’ పాటకు శ్రీలీల, కిరీటి వేసిన స్టెప్పులు సినిమాకు భారీ హైప్ వచ్చింది. దీంతో ఈ మూవీ ఓటీటీ విడుదల కోసం అభిమానులు భారీగానే ఎదురుచూశారు. అయితే, విడుదల విషయంలో కాస్త ఆలస్యం అయినప్పటికీ దసరా సెలవుల్లో విడుదల చేయడంతో మరింత జోష్ పెరగనుంది. జెనీలియా కీలక పాత్ర పోషించింది. కాలేజీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మొదలై ఎమోషనల్‌గా సాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.

కథేంటంటే..
విజయనగరానికి చెందిన కోదండపాణి(రవి చంద్రన్)-శ్యామల దంపతులకు ఆలస్యంగా పుట్టిన బిడ్డ అభి(కిరీటీ రెడ్డి). తండ్రి-కొడుకు మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉండడం.. ఆయన చూపించే అతిప్రేమ అభికి చిరాకు తెప్పిస్తుంది. తండ్రికి దూరంగా ఉండాలనే పైచదువుల కోసం సిటీకి వెళ్తాడు. ‘అరవయ్యేళ్లు వచ్చాక మనకంటూ చెప్పుకోవడానికి కొన్ని మెమోరీస్ ఉండాలి కదా’ అంటూ స్నేహితులతో కాలేజీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు.
తోటి విద్యార్థిని స్పూర్తి(శ్రీలీల)తో ప్రేమలో పడి.. ఆమె పని చేసే కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. తొలిరోజే తన ప్రవర్తనతో బాస్ విజయ సౌజన్య (జెనీలియా)కు చిరాకు తెప్పిస్తాడు. ఆ తర్వాత విజయ సౌజన్య గురించి ఓ నిజం తెలుస్తుంది. ఓ కారణంగా ఆమెతో కలిసి తన సొంతూరు విజయనగరానికి వెళ్తాడు. అభికి తెలిసిన నిజం ఏంటి? విజయనగరం గ్రామంతో విజయ సౌజన్యకు ఉన్న సంబంధం ఏంటి? అభి తండ్రి సొంత ఊరిని వదిలి ఎందుకు నగరానికి వచ్చాడు? కోదండ పాణికి, విజయ సౌజన్యకు మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.