చెన్నై: శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ పరాశక్తి. ఇది ఆయన హీరోగా యాక్ట్ చేసిన 25వ చిత్రం. రవిమోహన్ ప్రతినాయకుడిగా నటించిన ఇందులో అధర్వ కీలక పాత్ర పోషించారు. శ్రీలీల కథానాయిక. డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ కథా చిత్రానికి సుధాకొంగర కథ, దర్శకత్వం బాద్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2026 జనవరి 14న తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది.
గురువారం సాయంత్రం చిత్ర ప్రత్యేక కార్యక్రమాన్ని చెన్నైలోని వళ్లువర్‌కొట్టంలోని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పరాశక్తి సినిమాకు సంబంధించిన ఫోటోలు, ఇతర వస్తువులతో ఎగ్జిబిషన్‌ను 'వరల్డ్ ఆఫ్ పరాశక్తి' పేరుతో ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ నాలుగు రోజులదాకా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.

శివకార్తికేయన్ మాట్లాడుతూ.. పరాశక్తి సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్‌కు 100వ సినిమా అన్నారు. తన 25వ చిత్రాన్ని వేరే కథతో చేయాలని భావించానన్నారు. అయితే నిర్మాత ఆకాశ్ భాస్కర్ పరాశక్తి కథను చేయండి అని చెప్పారన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ మనల్ని 1960 కాలానికి తీసుకెళ్తుందన్నారు.
తానీ చిత్రం చేయడానికి కారణం దర్శకురాలు సుధా కొంగరనేనన్నారు. ఆమె 4 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి ఈ చిత్రకథ రాశారన్నారు. ఈ సినిమా చేయడమన్నది సవాల్‌తో కూడుకుందన్నారు. శ్రీలీల మాట్లాడుతూ.. పరాశక్తి తనకు చాలా ముఖ్యమైన సినిమా అన్నారు. రవిమోహన్ మాట్లాడుతూ.. ఈ సినిమా గురించి ఊరే మాట్లాడోతుందన్నారు. ఇందులో నటించడానికి ముందు సంకోచించానని, అయితే అందరూ ఎంతో శ్రమ పెట్టి పనిచేశారన్నారు.


