
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్- దర్శకుడు రాజమౌళి మళ్లీ ఒక సినిమా కోసం కలవబోతున్నారు. వీరిద్దరూ కలిసి ఒక బయోపిక్‌ను తెరపైకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు చర్చలు జరిపారని సోషల్‌మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమకు పితామహుడిగా గుర్తింపు పొందిన దాదాసాహెబ్ ఫాల్కే ధుండిరాజ్ గోవింద్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రంలో తారక్ నటించనున్నారట. ఈమేరకు బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. దాదాసాహెబ్ జీవితం అందరినీ ప్రభావితం చేసేలా ఉండటంతో దానిని ఒక సినిమాగా తెరకెక్కించి ప్రపంచానికి చూపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.
భారతీయ సినిమా పితామహుడి బయోపిక్ నిర్మించేందుకు 'మేడ్ ఇన్ ఇండియా' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఇందులో దాదాసాహెబ్ ఫాల్కే పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నట్లు సమాచారం. సుమారు రెండేళ్ల క్రితమే రాజమౌళి ఈ టైటిల్‌ను ప్రకటించారు. అయితే, నితిన్ కక్కర్ దర్శకత్వం వహిస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్ నటించనున్నట్లు బాలీవుడ్ మీడియాలో ప్రస్తుతం కథనాలు వస్తున్నాయి.

దాదాసాహెబ్ ఫాల్కే (Dhundiraj Govind Phalke), ఆయనను భారతీయ సినిమా పితామహుడిగా పిలుస్తారు. భారతీయ సినీ నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రచయితగా పేరుపొందారు. 1870 లో జన్మించిన ఆయన 1944 లో కన్నుమూశారు. 1913లో భారతదేశ మొదటి సినిమా "రాజా హరిశ్చంద్ర"ను ఆయనే తెరకెక్కించారు. అక్కడి నుంచి మొదలైన మన ప్రయాణం నేడు ప్రపంచస్థాయి గుర్తించే దిశగా అడుగులేస్తుంది. దాదాసాహెబ్ ఫాల్కే భారత చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడంలో చాలా కృషి చేశారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం 1969లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ఏర్పాటు చేసింది. భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారంగా భావిస్తారు.