మలయాళ సినీ పరిశ్రమలో పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) ప్రచారాల వివాదం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రముఖ నటుడు జోజు జార్జ్ తనపై ఓ ప్రముఖ మలయాళ నటుడు, ఆయన భార్య కలిసి కుట్రపూరితంగా వ్యతిరేక పీఆర్ ప్రచారం చేయిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కొత్త చిత్రం 'వరవ్' విడుదల సందర్భంగా నిర్వహించిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో మాట్లాడిన ఆయన, ఈ విషయాలను వెల్లడించారు. సదరు నటుడి దంపతులే కాకుండా, మలయాళ ఇండస్ట్రీకి చెందిన మరికొందరు ప్రముఖులు కూడా డబ్బులు తీసుకుని ఇలాంటి పీఆర్ కార్యకలాపాలు నడుపుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
షాజీ కైలాస్ దర్శకత్వంలో ఏ.కే. సాజన్ కథ అందించిన 'వరవ్' చిత్రం జూలై 16న థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ చిత్రంలో జోజు జార్జ్ హై రేంజ్ ప్రాంతానికి చెందిన 'పౌల్సన్' అనే కీలక పాత్రలో కనిపించారు. జీతూ జోసెఫ్ తెరకెక్కించిన 'వలతు వషతే కల్లన్ ' చిత్రం తర్వాత జోజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇదే కావడం విశేషం.
జోజు జార్జ్ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం మలయాళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లైవ్‌లో ఆయన ఎవరి పేర్లూ ప్రత్యక్షంగా చెప్పకపోవడంతో, ఆ స్టార్ దంపతులు ఎవరై ఉంటారనే దానిపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తున్నారు.


