
కొత్త సంవత్సరం మొదలై ఆరు నెలలు గడిచిపోయాయి. ఈ ఫస్టాఫ్‌లో ఎన్నో సినిమాలు రిలీజయ్యాయి. బాక్సాఫీస్ మీద కనక వర్షం కురిపించిన సినిమాలు కొన్నయితే నిర్మాతల నెత్తిన గుదిబండ వేసిన చిత్రాలు మరికొన్ని. అయితే వీటన్నింటినీ జల్లెడపట్టిన ఐఎమ్‌డీబీ (IMDB).. 2025 ఫస్టాఫ్- మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాల జాబితాను రిలీజ్ చేసింది.
ఫస్టాఫ్‌లో టాప్ 10
2025లో జనవరి 1 నుంచి జూలై 1 మధ్య విడుదలైన సినిమాలను పరిగణనలోకి తీసుకుంది. ఆరు, అంత కంటే ఎక్కువ రేటింగ్ వచ్చిన చిత్రాలను తన జాబితాలో పొందుపరిచింది. టాప్ 10లో అత్యధికంగా బాలీవుడ్ నుంచే ఆరు సినిమాలున్నాయి. అందరూ ఊహించినట్లుగానే విక్కీ కౌశల్ ఛావా సినిమా మొట్టమొదటి స్థానంలో ఉంది. రూ.130 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం రూ.809 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

టాప్ 5లో ఏమున్నాయ్?
మరాఠా యోధుడు శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు 500% లాభాలను తెచ్చిపెట్టింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్నా, దివ్య దత్తా, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. 2025లో ఇప్పటివరకు అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ మూవీగా ఛావా రికార్డు సృష్టించింది. తమిళ సినిమా డ్రాగన్ రెండో స్థానంలో ఉంది.
కోలీవుడ్ నుంచి 3 సినిమాలు
బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన షాహిద్ కపూర్ దేవా మూడో స్థానంలో ఉండటం గమనార్హం. అజయ్ దేవ్‌గణ్ రైడ్ 2 నాలుగో స్థానంలో, సూర్య రెట్రో ఐదో స్థానంలో ఉన్నాయి. ద డిప్లొమాట్, ఎల్ 2: ఎంపురాన్, సితారే జమీన్ పర్, కేసరి చాప్టర్ 2, విడాముయర్చి టాప్ 6 నుంచి 10 స్థానాల్లో నిలిచాయి. టాప్ 10లో తమిళం నుంచి మూడు, మలయాళం నుంచి ఒక మూవీ జాబితాలో ఉంది. టాలీవుడ్ నుంచి ఏ సినిమా కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది.
చదవండి: సినిమాలు మానేసి సెలూన్‌లో పని చేశా.. 10th ఫెయిలైనా..