నగర సినీ ప్రముఖుల భాగస్వామ్యంతో ఊపు
ఏడాది కూడా పలు కొత్త థియేటర్ల రాక
డాల్బీ సిస్టమ్‌తో పాటు సూపర్ ఫ్లెక్స్ కూడా..
కోకాపేట్‌లో అల్లు సినిమాస్ ప్రారంభోత్సవంతో హైదరాబాద్ తన మొదటి డాల్బీ సినిమా అనుభవాన్ని అందుకుంది. నగరంలో పెరుగుతున్న థియేటర్ల వ్యవస్థలో మల్టీప్లెక్స్ మరో ముందడుగు. 2025లో నటుడు రవితేజ భాగస్వామ్యంతో ఏషియన్ సినిమాస్ వనస్థలిపురంలో ఏఆర్‌టీ సినిమాస్ ను ప్రారంభించడం ద్వారా తన పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. అంతకుముందు శరత్ సిటీ మాల్‌లో నటుడు మహేష్ బాబుతో కలిసి ఏఎంబీ సినిమాస్, అమీర్‌పేట్‌లో నటుడు అల్లు అర్జున్‌తో కలిసి ఏఏఏ సినిమాస్ వెంచర్లు నెలకొల్పారు. పీవీఆర్ ఐనాక్స్ గ్రూప్ తేడాదిడిసెంబర్‌లో ఇనార్బిట్ మాల్‌లోని తమ 6 ్రస్కీన్ల మల్టీప్లెక్స్ ను 11 స్క్రీన్స్ సూపర్‌ప్లెక్స్‌గా పునరుద్ధరించింది. ఇది తెలంగాణలో పీవీఆర్‌కు మొదటిది. అలాగే, రెక్లయినర్లతో కూడిన మూడు లక్స్ స్క్రీన్లు అంతర్గత చెఫ్ అందించే మెనూ కూడా ఉన్నాయి. ఈ ప్రాపర్టీలో నగరంలోని మూడవ 4డీఎక్స్ స్క్రీన్ కూడా ఉంటుంది. ఇందులో మోషన్ సీట్లు వీక్షణ అనుభవాన్ని పెంచే గాలి, పొగ, సువాసన, నీరు స్నో వంటి ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి.
ఈ ఏడాది 2026 మధ్యలో ఆర్‌టీసీ ఎక్స్ రోడ్స్‌లో ఏఎంబీ క్లాసిక్ అనే కొత్త మల్టీప్లెక్స్‌ను ప్రారంభానికి సిద్ధమైంది. ఇందులో ప్రీమియం ఎక్స్‌ట్రా లార్జ్ ఫార్మాట్ 55 అడుగుల వెడల్పు స్క్రీన్ ఉంది. పీవీఆర్ ఐనాక్స్ లిమిటెడ్ సీఈఓ గ్రోత్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోద్ అరోరా, తమ విస్తరణ ఇంకా మధ్యలోనే ఉందని ధ్రువీకరించారు. ‘అనేక కొత్త ప్రాపర్టీలు ఇంకా అభివృద్ధి దశలో ఉన్నాయని ఆయన తెలిపారు. హెచ్‌ఎస్‌ఆర్ ఆర్క్, ఆర్‌టీసీ ఎక్స్ రోడ్స్‌లోని ఓడియన్ మాల్, కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని లేక్ షోర్ మాల్(ఇందులో ప్లేహౌస్ పీఎక్స్‌ఎల్ ఫార్మాట్ స్క్రీన్లు ఉన్నాయి). ఎల్బీనగర్‌లోని హెచ్‌ఎస్‌ఆర్ మాల్, బండ్లగూడలోని లీగ్ మాల్ త్వరలో ప్రారంభం కానున్నాయి. మల్టీప్లెక్స్‌ల పరంగా తగినంత సేవలు లేని నగరంలోని ఇతర ప్రాంతాలను మేం అన్వేషిస్తున్నాం.’ అని వారు చెబుతున్నారు.
నగరంతో పాటూ పెరుగుతూ..
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2,053 చదరపు కిలోమీటర్లు విస్తరించింది. సుమారు 1.3 కోట్లకు పైగా జనాభా కలిగి ఉంది. ఇటీవలి సంవత్సరాలలో, బహుళజాతి ఐటీ కంపెనీలు దానికి అనుగుణంగా గృహ నిర్మాణ ప్రాజెక్టుల పెరుగుదల కారణంగా నగరం, ముఖ్యంగా పశ్చిమ జోన్‌లో భారీ విస్తరణను చూసింది. హైటెక్ సిటీ గచ్చిబౌలికి ఆవల నల్లగండ్ల, కోకాపేట్ వరకు విస్తరించిన ప్రాంతాల్లో కొత్త మల్టీప్లెక్స్ లకు పెరిగిన అవకాశాలను ఏషియన్ సినిమాస్ నిర్మాత సునీల్ నారంగ్ వంటివారు పరిశీలిస్తున్నారు. ‘కొత్తగృహ ప్రాజెక్టులతో, సిటీకి చెందిన అత్యంత ప్రధాన జనాభా ఈ ప్రాంతాలలో స్థిరపడుతోంది’ అంటారాయన. ఏషియన్ సినిమాస్ దాని మల్టీప్లెక్స్‌ల ద్వారా నగరంలోని ఇతర ప్రాంతాలలోకి కూడా ప్రవేశిస్తోంది. ఈ గ్రూప్‌నకు జీహెచ్‌ఎంసీ పరిధిలో 54 స్క్రీన్లు ఉన్నాయి. ఇందులో ఎనిమిది ప్రాపరీ్టలలో 40 మల్టీప్లెక్స్ స్క్రీన్లు ఉన్నాయి.
సంతరించుకుంటున్న సాంకేతికత
‘ఉత్తమ ఆడియో విజువల్ నాణ్యతను అందించడానికి సాంకేతిక అంశాలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేస్తున్నాం’ అని నారంగ్ తెలిపారు. అలాగే మా ఫుడ్ మొత్తం మా చెఫ్‌లతోనే తయారవుతుంది. శాండ్‌విచ్‌లు, బర్గర్‌లు, పిజ్జాల కోసం ఉపయోగించే బ్రెడ్స్, బర్గర్లు, పిజ్జా బేస్‌లను స్వయంగా మా ప్రాంగణంలోనే తయారు చేస్తారని అన్నారాయన. సింగిల్ స్క్రీన్లు అధికంగా కలిగిన ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోకి ప్రవేశించడం గురించి మాట్లాడుతూ, సంప్రదాయ సింగిల్ స్క్రీన్లు ఎక్కువగా మల్టీప్లెక్స్‌లకు మారుతున్నాయి. పైగా ఆ ప్రాంతంలో మల్టీప్లెక్స్ కూడా అవసరమని మేం భావించాం’ అని చెప్పారు.
థియేటర్ల మనుగడకు ఢోకా లేదు
డిజిటల్ ప్లాట్ ఫామ్‌లు, మొబైల్ ఫోన్లలో షార్ట్–ఫామ్ కంటెంట్ నుంచి ప్రేక్షకులను దూరం చేయడానికి చిత్ర నిర్మాతలు కష్టపడు తున్న సమయంలో కొత్త థియేటర్ల పెరుగుదల గురించి మాట్లాడుతూ ‘ఇంట్లో సినిమా చూడటం సౌకర్యవంతంగా ఉండవచ్చు.. కానీ అది సినిమా హాళ్లలో సామూహిక వీక్షణ ఆనందాన్ని భర్తీ చేయదు. అంతకుముందు కూడా థియేటర్లు టెలివిజన్ డిజిటల్ వెల్లువను తట్టుకుంటాయా అనే సందేహాలు ఉండేవి. ఆ పరిస్థితి నుంచి థియేటర్లు మరింత బలంగా ఉద్భవించాయి. ప్రేక్షకులు నాణ్యమైన చిత్రాలను కోరుకుంటున్నారని, నిర్మాతలుగా దాన్ని అందించడం బాధ్యత, వారికి సౌకర్యాలతో కూడిన వీక్షణ అనుభవాన్ని అందించడం థియేటర్ యజమానుల బాధ్యత అన్నారు’ నారంగ్.


