హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కు ఆస్కార్‌ అవార్డు | Hollywood actor Tom Cruise will get an Oscar 2025 | Sakshi
Sakshi News home page

హాలీవుడ్‌ నటుడు టామ్‌ క్రూజ్‌కు ఆస్కార్‌ అవార్డు

Jun 19 2025 1:17 AM | Updated on Jun 19 2025 10:28 AM

Hollywood actor Tom Cruise will get an Oscar 2025

ఆస్కార్‌ గవర్నర్స్‌ అవార్డుల ప్రకటన

హాలీవుడ్‌ ప్రముఖ నటుడు–నిర్మాత టామ్‌ క్రూజ్‌ ఎట్టకేలకు ఆస్కార్‌ అవార్డు అందుకోనున్నారు. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ పదిహేనేళ్లుగా ప్రతి ఏడాది గవర్నర్స్‌ అవార్డ్స్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. 16వ వార్షిక అవార్డు ప్రదానం ఈ ఏడాది నవంబరులో జరగనుంది. ఈసారి ఆస్కార్‌ గవర్నర్‌ అవార్డులను అందుకోనున్న వారి వివరాలను ఆస్కార్‌ కమిటీ అధికారికంగా వెల్లడించింది. 

హాలీవుడ్‌ నటుడు–నిర్మాత టామ్‌ క్రూజ్‌తో పాటు అమెరికన్‌ నటి–దర్శక–నిర్మాత–కొరియోగ్రాఫర్‌ డెబ్బీ అల్లెన్, ప్రొడక్షన్‌ డిజైనర్‌ విన్‌ థామస్‌లు ఈ ఏడాది ఆస్కార్‌ గౌరవ పురస్కారా లను స్వీకరించనున్నారు. అలాగే అమెరికన్‌ గాయని–నటి–రచయిత– సంగీత దర్శకురాలు డాలీ పార్టన్‌కు జీన్‌ హెర్షోల్ట్‌ హ్యూమానిటేరియన్‌ అవార్డు లభించింది.

సినిమా రంగంలో సుధీర్ఘమైన కెరీర్, సినిమాల పట్ల ఎంతో అంకితభావం చూపిన నలుగురు దిగ్గజ వ్యక్తులను ఈ ఏడాది ఆస్కార్‌ గవర్నర్స్‌ అవార్డ్స్‌తో సత్కరించనున్నాం’’ అని ఆస్కార్‌ అకాడమీ అధ్యక్షురాలు జానెట్‌ యాంగ్‌ పేర్కొన్నారు. 

ఇక ఈ 16వ ఆస్కార్‌ గవర్నర్స్‌ అవార్డ్స్‌ వేడుక కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజిల్స్‌లో నవంబరు 16న జరగనుంది. ఇక ఇప్పటివరకు నాలుగు ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌ దక్కించుకున్నప్పటికీ టామ్‌ క్రూజ్‌కు అవార్డు దక్కలేదు. ఫైనల్‌గా ‘అకాడమీ గౌరవ పురస్కారం’ దక్కుతున్నందుకు ఆయన ఫ్యాన్స్‌ హ్యాపీ ఫీలవుతున్నారు. ఇక 98వ ఆస్కార్‌ అవార్డుల వేడుక వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement