
‘‘ఇప్పుడు నా వయసు 24 ఏళ్లే. నా కెరీర్ ఇప్పుడేప్రారంభం అయింది. 30 ఏళ్లు వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు’’ అని హీరోయిన్ శ్రీలీల చెప్పారు. ‘పెళ్లి సందడి’(2021) చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన ఆమె బిజీ హీరోయిన్‌గా దూసుకెళుతున్నారు. అలాగే తమిళ, హిందీ చిత్రాల్లోనూ నటిస్తున్నారామె. ‘ఆషికి 3’ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌కి జోడీగా నటిస్తున్నారు శ్రీలీల. అయితే వీరిద్దరి రిలేషన్ గురించి గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌లో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ప్రేమ, పెళ్లి, వ్యక్తిగత జీవితం వంటి విషయాలపై మాట్లాడారు. ‘‘ప్రస్తుతం నాకు 24 సంవత్సరాలు. కెరీర్ పరంగా ఇంకా ఎన్నో కలలున్నాయి.
ప్రస్తుతం పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేందుకు సమయం లేదు. నా జీవితంలో పెళ్లి అనేది 30 ఏళ్ల తర్వాతే జరుగుతుంది. అప్పటి వరకు ‘మీ వివాహం ఎప్పుడు?’ అని నన్ను ఎవరూ అడగొద్దు. ప్రస్తుతం నేను ప్రేమలో ఉన్నానని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, నిజంగా అలాంటిదేం లేదు. నాపై వచ్చిన పుకార్లన్నీ అసత్యం. నేను ఎక్కడికెళ్లినా మా అమ్మ నా వెంట ఉంటుంది.
అమెరికా వెళ్లినప్పుడు కూడా నాతోనే ఉంది. అలాంటి పరిస్థితుల్లో నేను ఎవరితో ప్రేమలో పడగలను? నిజంగా ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే మా అమ్మ మాతో కలిసి ఉండగలదా? ప్రస్తుతానికి నా తొలిప్రాధాన్యం కెరీర్‌కే. పెద్ద సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఆ సినిమాల్లో బాగా నటించి, ప్రేక్షకుల మెప్పు పొందేందుకు కష్టపడుతున్నాను. నా కంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి.. వాటిని సాధించిన తర్వాతే వ్యక్తిగత విషయాల గురించి ఆలోచిస్తాను’’ అని తెలిపారు శ్రీలీల. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘మాస్ జాతర, ఉస్తాద్ భగత్‌సింగ్’, తమిళంలో ‘పరాశక్తి’, హిందీలో ‘ఆషికి 3’ వంటి సినిమాలు చేస్తున్నారు.