
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' భారీ అంచనాలతో జులై 24న విడుదలైంది. క్రిష్, జ్యోతికృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. సుమారు రూ. 250 కోట్లతో ఎ.ఎం.రత్నం నిర్మించారు. అయితే, ప్రీమియర్ షోలు పూర్తి అయన తర్వాత నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. పేలవమైన కథాంశం, విఎఫ్ఎక్స్ కారణంగా 'వీరమల్లు' విమర్శల పాలైంది. దీంతో మొదటిరోజు, ప్రీమియర్ షోలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ. 47 కోట్ల నెట్ వరకే పరిమితం అయింది. రెండోరోజులు పూర్తి అయ్యే సరికి రూ. 56.29 కోట్ల నెట్ కలెక్షన్స్‌కు చేరుకుంది. అయితే, డే-2 మరింత దారుణమైన కలెక్షన్స్ రాబట్టినట్లు ప్రముఖ వెబ్‌సైట్ సాక్నిల్క్ పేర్కొంది.
చిన్న హీరోల సినిమాలు విడుదలైతేనే మొదటిరోజు, రెండోరోజు అంటూ కలెక్షన్స్ మేకర్స్ ప్రకటిస్తారు. కానీ, 'హరి హర వీరమల్లు' చిత్ర యూనిట్ ఇప్పటి వరకు అధికారికంగా కలెక్షన్స్ వివరాలు ఎక్కడా కూడా ప్రకటించలేదు. అయితే, బాక్సాఫీస్ లెక్కలను మాత్రమే ఎప్పటికప్పుడు ప్రచురించే 'సాక్నిల్క్' మాత్రం ప్రపంచవ్యాప్తంగా వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉన్నాయో పేర్కొంది. రెండోరోజు ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ. 8.79 కోట్ల నెట్ మాత్రమే రాబట్టినట్లు తెలిపింది.
బెనిఫిట్ షోల ద్వారా రూ. 12.75 కోట్ల నెట్, మొదటిరోజు రూ. 34.75 కోట్ల నెట్, రెండో రోజు రూ. 8.79 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి మొత్తంగా ఇప్పటి వరకు రూ. 56.29 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. గ్రాస్ కలెక్షన్స్ పరంగా చూస్తే రెండురోజులకు గాను రూ. 92 కోట్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పుడు శనివారం, ఆదివారం వీకెండ్ ఉంది కాబట్టి ఈ రెండు రోజుల్లో వీరమల్లు కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది.