
దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా రాణించినవారిలో హన్సిక మొత్వానీ (Hansika Motwani) ఒకరు. ముఖ్యంగా తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటించి స్టార్‌డమ్ అందుకున్నారు. దాదాపు 50కిపైగా చిత్రాల్లో కథానాయికగా నటించిన హన్సిక.. 2022లో సోహైల్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే ఈమె పెళ్లి కూడా చాలామంది హీరోయిన్లలాగానే మనస్పర్థలతో ముగిసిపోయిందంటూ ప్రచారం జరుగుతోంది.
రెండు వివాదాల మధ్య హన్సిక
భర్తకు దూరంగా తన తల్లితోనే ఉండడంతో ఈ రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. మరోవైపు హన్సికపై ఆమె సోదరుని భార్య గృహహింస ఆరోపణలు చేసింది. ఇలాంటి సమస్యల నుంచి బయటపడడానికి, మనశ్శాతి కోసం ఈ బ్యూటీ విహారయాత్రలు చేసి వచ్చినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ సినిమాలపైనే ఫుల్ ఫోకస్ చేయాలనే నిర్ణయానికి వచ్చిన హన్సిక తనపై వస్తున్న విమర్శలను తెలుసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిసింది.
ఈ ఏడాది పూర్తయ్యేసరికి..
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తన గురించి ఎవరేం అనుకుంటున్నారు? ఎలాంటి వదంతులు ప్రసారం అవుతున్నాయి? అని తన సన్నిహితుల ద్వారా వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరికల్లా తన సమస్యలు తొలగిపోతాయని తన అత్యంత సన్నిహితురాలు వద్ద హన్సిక అన్నట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. హన్సిక ఆ మధ్య నాలుగు సినిమాలు చేసింది. కానీ, అవింకా రిలీజ్ కాలేదు.