
తెలంగాణ రాష్ట్రప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించింది. మొత్తం 11 కేటగిరీల్లో వీటిని వెల్లడించారు. 2024కు సంబంధించి అన్ని కేటగిరీల్లోనూ అవార్డుల వివరాలను గురువారం జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ వెల్లడించారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో మూడు చిత్రాలకు అవార్డులు ప్రకటించారు. అందులో మొదటి చిత్రం కల్కి , రెండో చిత్రంగా పొట్టేల్, మూడో చిత్రంగా లక్కీ భాస్కర్ ఎంపికైంది. ఈ చిత్రాలకు గాను జూన్ 14న అవార్డులు అందిస్తారు. ఉత్తమ చిత్రాలుగా అవార్డులు గెలుచుకున్న చిత్రాల నేపథ్యంపై ఓ లుక్కేద్దాం.

ఫలించిన నాగ్ అశ్విన్ ప్రయోగం
వెండితెరపై ప్రయోగాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. కొద్ది మంది దర్శకులు మాత్రమే వైవిధ్యభరిత కథలను తెరకెక్కిస్తుంటారు. అది విజయం సాధించిందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆ ప్రయోగం మాత్రం చాలా మందికి ఆదర్శంగా నిలుస్తుంది. అలాంటి ప్రయోగాత్మక చిత్రమే కల్కి 2898 ఏడీ. ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇప్పటివరకు చూడనటువంటి ప్రపంచాన్ని కల్కి చిత్రం ద్వారా సృష్టించాడు దర్శకుడు నాగ్ అశ్విన్. పురాణాల్లోని పాత్రలను తీసుకొని, దానికి ఫిక్షన్ జోడించి సరికొత్తగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. కురుక్షేత్రం తర్వాత ఆరు వేల ఏళ్లకు మొదలయ్యే కథ ఇది.మొదటి నగరంగా చెపుకునే కాశీలో తాగడానికి నీళ్లు కూడా లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. ప్రకృతి మొత్తం నాశనం అవుతుండటంతో సుప్రీం యాష్కిన్(కమల్ హాసన్) కాంప్లెక్స్ అనే కొత్త ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని వనరులు కాంప్లెక్స్‌లో ఉంటాయి. ఎప్పటికైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లి సుఖపడాలనేది ఫైటర్ భైరవ (ప్రభాస్)కోరిక.మరోవైపు యాష్కిన్ చేస్తున్న అన్యాయాలపై రెబల్స్ తిరుగుబాటు చేస్తుంటారు. సుప్రీం యాష్కిన్‌ని అంతం చేసి కాంప్లెక్స్ వనరులను అందరికి అందేలా చేయాలనేది వారి లక్ష్యం. దాని కోసం ‘శంబాల’ అనే రహస్య ప్రపంచాన్ని క్రియేట్ చేసుకొని అక్కడి నుంచే పోరాటం చేస్తుంటారు. ‘కాంప్లెక్స్’లో ‘ప్రాజెక్ట్ కే’పేరుతో సుప్రీం యాష్కిన్ ఓ ప్రయోగం చేస్తుంటాడు. గర్భంతో ఉన్న సమ్-80 అలియాస్ సుమతి(దీపికా పదుకొణె) కాంప్లెక్స్ నుంచి తప్పించుకొని శంబాల వెళ్తుంది.. సుమతిని పట్టుకునేందుకు కాంప్లెక్స్ మనుషులు ప్రయత్నిస్తుంటారు. ఆమెను అప్పగిస్తే కాంప్లెక్స్‌లోకి వెళ్లొచ్చు అనే ఉద్దేశంతో భైరవ కూడా సుమతి కోసం వెళ్తాడు.
వీరిద్దరి బారి నుంచి సుమతిని కాపాడేందుకు అశ్వత్థామ(అమితాబ్ బచ్చన్) ప్రయత్నిస్తాడు. అసలు అశ్వత్థామ ఎవరు? వేల సంవత్సరాలు అయినా అతను మరణించకుండా ఉండడానికి గల కారణం ఏంటి? సుమతిని ఎందుకు కాపాడుతున్నాడు? ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డ ఎవరు? సుప్రీం యాష్కి చేపట్టిన ‘ప్రాజెక్ట్ కే’ ప్రయోగం ఏంటి? కాంప్లెక్స్‌లోకి వెళ్లాలనుకున్న భైరవ కోరిక నెరవేరిందా? అసలు భైరవ నేపథ్యం ఏంటి? అశ్వత్థామతో పోరాడే శక్తి అతనికి ఎలా వచ్చింది? భైరవ, అశ్వత్థామ మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సందేశం ఇచ్చిన పొట్టేల్
పొట్టేల్..పేరుకు చిన్న సినిమానే కానీ కథ మాత్రం చాలా పెద్దది. 1970-80 కాలంలో ఉన్న పటేళ్ల పెత్తనం, మూఢ నమ్మకాలు, సమాజంలో ఉన్న అసమానతలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూనే చదువు యొక్క గొప్పదనాన్ని ఈ సినిమా ద్వారా తెలియజేశారు. 1970-80 మధ్యకాలంలో సాగే కథ ఇది. తెలంగాణ-మహారాష్ట్ర బార్డర్‌లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు గుర్రంగట్టు. అక్కడ పటేళ్లదే రాజ్యం. ఆ ఊరిలో 12 ఏళ్లకు ఒక్కసారి బాలమ్మ జాతర నిర్వహిస్తారు. ఆ జాతరలో పొట్టేల్‌ని బలి ఇవ్వడం ఆనవాయితీ. అయితే వరుసగా రెండు సార్లు జాతర సమయానికి బలి ఇచ్చే పొట్టేల్ చనిపోవడంతో ఆ ఊర్లో కరువు తాండవిస్తుంది. అలాగే ప్రజలు అనారోగ్య బారిన పడి చనిపోతుంటారు. ఈసారి జాతరకు ఎలాగైనా పొట్టేల్‌ని బలి ఇవ్వాలని, దాని కాపాడాల్సిన బాధ్యతను గొర్రెల కాపరి పెద్ద గంగాధరి (యువచంద్ర కృష్ణ)కు అప్పగిస్తారు. పటేల్(అజయ్) చేసే మోసాలన్నీ గంగాధరికి తెలుసు. తన అవసరాల కోసమే బాలమ్మ సిగం(పూనకం రావడం) వచ్చినట్లు నటిస్తున్నాడని.. ఆయన మాటలు నమ్మొదని చెప్పినా ప్రజలెవరు పట్టించుకోరు. భార్య బుజ్జమ్మ(అనన్య నాగళ్ల) మాత్రం గంగాధరి మాటలను నమ్ముతుంది.
పటేళ్ల పిల్లల మాదిరే తన కూతురు సరస్వతికి కూడా చదువు చెప్పించాలనుకుంటాడు. ఇది పటేల్‌కు నచ్చదు. దీంతో ఊరి బడి పంతులు(శ్రీకాంత్ అయ్యంగార్)ని బ్రతిమిలాడి కూతురికి రహస్యంగా చదువు చెప్పిస్తాడు. ఇంతలో ఊరి జాతర దగ్గర పడుతుందనగా బాలమ్మ పొట్టేల్ కనిపించకుండా పోతుంది. గాంగాధరి తప్పిదం వల్లే పొట్టేల్ పోయిందని.. దాని తీసుకురావాల్సిన బాధ్యత అతనిదే అని పటేల్ ఆదేశిస్తాడు. అంతేకాదు బాలమ్మ పూనినట్లు నటిస్తూ.. పొట్టేల్‌ని తీసుకురాకుంటే ఈసారి జాతరలో గంగాధరి కూతురు సరస్వతిని బలి ఇవ్వాలని చెబుతాడు. ఊరి జనాలు కూడా ఇది బాలమ్మ ఆదేశం అని నమ్ముతారు. అసలు పొట్టేల్ ఎలా మాయం అయింది? కూతురు ప్రాణాలను కాపాడుకోవడం కోసం గంగాధరి ఏం చేశాడు. చివరకు పొట్టేల్ దొరికిందా లేదా? పటేల్ నిజస్వరూపం తెలిసిన తర్వాత ఊరి జనాలు ఏం చేశారు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

భాస్కర్ లక్కీనే..
1992లో జరిగిన హర్షద్ మెహతా స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమే లక్కీ భాస్కర్. బ్యాంక్‌లో పని చేసే ఒక కామన్ స్టాక్ ఎక్సేంజ్‌ని ఎలా బురిడీ కొట్టించారనేది ఈ సినిమా కథ. బ్యాంకింగ్ వ్యవస్థ, స్టాక్ మార్కెట్, మధ్య తరగతికి చెందినవారి మనస్తత్వాలు... వీటన్నిటినీ మేళవిస్తూ ఓ వ్యక్తి జీవిత ప్రయాణంగా ఈ చిత్రాన్ని మలిచాడు దర్శకుడ వెంకీ అట్లూరి. కథ విషయానికొస్తే.. ఈ కథ అంతా ముంబైలో 1989-92 మధ్యలో జరుగుతుంది. భాస్కర్ కుమార్(దుల్కర్ సల్మాన్).. మగధ బ్యాంక్ లో క్యాషియర్ గా పనిచేస్తుంటాడు. ఇంటి నిండా అప్పులే. కనీసం ప్రమోషన్ వస్తే చాలు.. కష్టాలు తీరుతాయి అనుకుంటాడు. కష్టపడి పనిచేసినా అది వేరే వాళ్లకు దక్కుతుంది.
దీంతో డబ్బు అవసరమై ఆంటోనీ(రాంకీ) అనే వ్యక్తితో కలిసి బ్యాంక్ డబ్బులతో చిన్న చిన్న స్కామ్స్ చేస్తాడు. అంతా బాగానే ఉంటది. డబ్బులు బాగానే సంపాదిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఇదంతా ఆపేస్తాడు. కానీ అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఏకంగా బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్ అవుతాడు. కోట్లకు కోట్లు సంపాదిస్తాడు. ఇంత డబ్బు ఎలా సంపాదించాడు? భాస్కర్ ని సీబీఐ వాళ్ళు ఎందుకు ఎంక్వయిరీ చేశారు? ఈ కథకి బిగ్ బుల్ హర్ష మెహ్రాకి సంబంధం ఏంటనేది మిగిలిన స్టోరీ.