
స్నేహం అనే భావన మనసులను తాకే అంశం. తెలుగు, హిందీ సినిమాల్లో ఎన్నో సూపర్‌హిట్ స్నేహగీతాలు ప్రేక్షకుల మనసుల్లో చిరస్మరణీయమయ్యాయి. ఆ పాటలు కేవలం సంగీతానికే కాకుండా, స్నేహ బంధం విలువను గుర్తు చేస్తూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. తెలుగు సినిమాల విజయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ సినిమాల్లోని హిట్ పాటలు వింటూ మన చిన్ననాటి స్నేహితులు, ప్రాణ స్నేహితులను గుర్తు చేసుకోకుండా ఉండలేం. అలాంటి కొన్ని పాటల్ని, మన స్నేహితుల్ని స్నేహితుల దినోత్సవం సందర్భంగా...గుర్తు చేసుకుంటూ...
స్నేహస్ఫూర్తిని అందించిన తెలుగు పాటలెన్నో...
సాక్షాత్తూ అల్లా దిగివచ్చి వరమిస్తా కోరుకో అంటే.. కూడా ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్కనేస్తం చాలంటాను... అంటూ ఒక మంచి ఫ్రెండ్ ఉన్నవాడు ఎంత సంపన్నుడో వివరిస్తుందీ పాట. 1974లో విడుదలైన నిప్పులాంటి మనిషి సినిమాలోని ‘‘స్నేహమేరా జీవితం’’. పాట ఫరెవర్ ఫ్రెండ్ షిప్ సాంగ్ అని చెప్పాలి. మాధవపెద్ది సత్యం సంగీత దర్శకత్వంలో గాన గంధర్వుడు ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంతో పాటు గాయకుడు జి. ఆనంద్ కూడా తన గాత్రం జత చేశారు. రచయిత : సి.నా.రె. అక్షరాద్భుతాలు ఆవిష్కరించగా సంగీతదర్శకుడు: రోహిణీ చంద్ర. కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడి పోయాడు ఎందుకో ఈనాడు.. అంటూ స్నేహితుడి బాధను పంచుకోవడానికి కులమతాల అడ్డులేదంటూ చాటుతుందీ పాట. సినిమాలో స్నేహితుడైన ఎన్టీయార్ ను ఉద్ధేశిస్తూ లెజండరీ నటుడు కైకాల సత్యనారాయణ ఆవిష్కరించిన పాటాభినయం మరచిపోలేనిది.
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా...
ప్రాణ స్నేహితులు (1988) చిత్రంలోని ఈ పాట స్నేహ బంధానికి సాటిలేని విలువను అందిస్తుంది. తుల తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా, నీ గౌరవం నిలిపేనురా... . బంధువులెందరు ఉన్నా, నిజమైన స్నేహానికి సాటిరారనే భావాన్ని పల్లవి – చరణాలలో గొప్పగా ఆవిష్కరిస్తుంది. ‘త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం స్నేహం ... అంటూ స్పష్టం చేస్తుంది. స్నేహం గొప్పతనాన్ని చాటడానికి బహుశా ఇంత కన్నా మంచి పాటను ఎంచుకోలేమేమో...భువన చంద్ర పదాలు, రాజ్‌కోటి స్వరాలు కూర్చిన ఈ పాటకు గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం తన గాత్రంతో జీవం పోశారు. కృష్ణంరాజు, శరత్‌బాబు, మురళీమోహన్ లు స్నేహితులుగా నటించారు.
మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ...
స్నేహం అంటే యుక్త వయస్కుల మధ్యే కాదు నడి వయస్కుల మధ్య కూడా ఉంటుంది. వయసుతో పాటే పరిణితి చెందిన ఆ స్నేహ బంధపు గొప్ప తనాన్ని చాటి చెబుతుంది. 1999లో విడుదలైన స్నేహం కోసం చిత్రంలోని మీసమున్న నేస్తమా నీకు రోషమెక్కువ పాట. మెగాస్టార్ చిరంజీవి, తమిళ నటుడు విజయ్‌కుమార్ లు స్నేహితులుగా జీవించిన పాట ఇది. ప్రతీ ఒక్కరికీ అలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అనిపించేలా ఈ పాటలోని సాహిత్యాన్ని లెజండరీ రైటర్ కీ.శే.సిరివెన్నల సీతారామశాస్త్రి రాయగా గాయకుడు రాజేష్ అద్భుతంగా ఆలపించారు. ఒక్క పాటలో స్నేహం అంటే ఆటలు, పాటలతో పాటు పరస్పర బాధ్యత కూడా అంటూ చూపించడం జరిగింది. స్నేహానికి చెలికాడా దోస్తీకి సరిజోడా ఏళ్ళెదిగిన పసివాడా ఎన్నటికీ నీను వీడ అంటూ సాగే ఆ పాటలో..ఒక్క తల్లి సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనమిద్దరంటే ఎవరైన నమ్మగలరా? నువ్వు పెంచిన పిల్ల పాపలకు తల్లీ తండ్రినైనా ప్రేమ పంచినా తీరులోన నే నిన్ను మించగలనా ఏ పుణ్యం చేసానో నీ స్నేహం పొందాను నా ప్రాణం నీదైనా నీ చెలిమి ఋణం తీరేనా? వంటి పదాలు స్నేహ పరిపూర్ణతను చాటుతాయి.
‘ముస్తఫా ముస్తఫా‘ (ప్రేమ దేశం – 1996)..
ఏ.ఆర్. రెహమాన్ కంపోజ్ చేసిన ఈ పాట బాధ్యతలెరుగని స్నేహ బంధాన్ని సున్నితంగా ఆవిష్కరిస్తుంది. స్నేహితుల మధ్య ఉన్న సరదాలను, చిలిపి బంధాన్ని వినిపిస్తుంది. ఇప్పటికీ ఈ పాట వినపడని ఫ్రెండ్‌షిప్ డే వేడుక అరుదే. కష్టమొచ్చినా నష్టమొచ్చినా వీడిపోనిది ఫ్రెండ్ ఒక్కడే హద్దంటూ లేనే లేనిది ఫ్రెండ్‌షిప్ ఒక్కటే... అంటూ సాగే ఈ పాట నాటి యువ హీరోలు అబ్బాస్, వినీత్‌ల సాక్షిగా కోడె వయసు కుర్రకారు ఫ్రెండ్ షిప్‌కి ఇచ్చే విలువను కళ్లకు కడుతుంది.
చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో...
1989లో విడుదలైన చిన్నారి స్నేహం అనే సినిమాలోని ఈ పాట చదువు ముగించుకుని కెరీర్‌లు వెదుక్కుంటూ సాగిపోయే దశలో..వీడ్కోలు పలుకుతున్న స్నేహితుల భారమైన హృదయాలకు అద్దం పడుతుంది. చిన్నారి స్నేహమా చిరునామా తీసుకో గతమైన జీవితం కధగానే రాసుకో.మనసైతే మళ్లీ చదువుకో మరుజన్మకైనా కలుసుకో ఏ నాటికి ఏదవుతున్నా ఏ గూడు నీదవుతున్నా హాయిగానే సాగిపో.. అంటూ ఎవరెక్కడ ఉన్నా చిన్నారి స్నేహాన్ని మాత్రం చిర కాలం నిలుపుకోవాలని కాంక్షిస్తూ సాగే ఈ పాటను వేటూరి సుందరరామ్మూర్తి హృద్యంగా రాయగా చక్రవర్తి అంతే హాౖయెన స్వరాలు సమకూర్చారు. చంద్రమోహన్, రఘు, సీత తదితరులు చిన్నారి స్నేహితులుగా మెప్పిస్తారు.