జూనియర్ ఎన్టీఆర్ రాముడిగా నటించిన చిత్రం 'రామాయణం'.. ఎంఎస్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులను విశేషంగా అలరించింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. బాల నటుడిగా తన నటనా సామర్థ్యం ఏంటో తెలుగు ప్రేక్షకులకు తారక్ చూపించాడు.
ఈ మూవీ షూటింగ్ సమయానికి అతని వయసు కేవలం 13ఏళ్లు మాత్రమే.. ‘రామాయణం’ కంటే ముందు... ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో శకుంతల తనయుడు భరతునిగా తారక్ నటించినా... ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ విధంగా చూసుకుంటే... తారక్ వెండితెరపై కనిపించిన తొలి సినిమా రామాయణమే (1997). అయితే, ఈ మూవీ గురించి తాజాగా గుణశేఖర్ పలు విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా తారక్ పెంపకం గురించి ఆయన మాట్లాడటం విశేషం.

'రామాయణం' సెట్స్‌లో తారక్‌ను తిడితే..: గుణశేఖర్
సినిమా సెట్స్‌లో తారక్ ఎలా ఉండేవారో గుణశేఖర్ ఇలా చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌ను చాలా పద్ధతిగా వారి అమ్మగారు పెంచారని ఆయన గుర్తు చేసుకున్నారు. 'రామాయణం సినిమా షూట్‌లో భాగంగా ఒక్కసారి తారక్‌ను బాగా తిట్టాను. దీంతో తను చాలా బాధతో వారి అమ్మ (షాలిని) వద్దకు వెళ్లిపోయాడు. అయితే, ఆ సమయంలో షాలిని గారు నన్ను ఒక్కమాట కూడా అనలేదు. పైగా తారక్‌నే మందలించారు. డైరెక్టర్ చెప్పినట్లు వినాల్సిందేనని గట్టిగా తారక్‌కు చెప్పారు. డైరెక్టర్ తిట్టినా, కొట్టినా సరే పడాల్సిందేనని చెప్పడంతో.. సరే అమ్మా అంటూ అలానే నిలబడిపోయాడు. జూనియర్ ఎన్టీఆర్ తన అమ్మ మాటకు చాలా విలువ ఇస్తాడు. అమ్మ పెంపకం షాలిని మాదిరి ఉండాలని నేను అనుకుంటాను. ఆమె పెంపకం గురించి తెలుస్తే ఎవరైనా సరే మెచ్చుకోవాల్సిందే.' అని గుణశేఖర్ అన్నారు.
రామజననం నుంచి రావణ సంహారం వరకూ సాగే ఈ కథను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తీరు అభినందనీయం. పిల్లలకు తగ్గట్టు ఆభరణాలను తయారు చేయించడమేకాదు, వారి హైట్‌ని బట్టి అంతఃపురం సెట్లను కూడా వేయించి, చూపరులను అబ్బురపరిచారు. పిల్లలతో రామకథను తీసి వెండితెరను పులకింపజేశారాయన.


