మే నెలలో ఓటీటీలో రిలీజవుతున్న చిత్రాలివే!

Exciting Telugu Movies Will Released On OTT In May 2021 - Sakshi

కరోనా వల్ల ఈ ఏడాది కూడా థియేటర్లకు సమ్మర్‌ హాలీడేస్‌ వచ్చాయి. దీంతో చిన్నపాటి చిత్రాల నుంచి పెద్ద స్థాయి సినిమాలు కూడా రిలీజ్‌ను వాయిదా వేసుకుంటుండగా మరికొన్ని మాత్రం ఓటీటీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు ఓటీటీతో మంచి డీల్‌ కుదుర్చుకోవడంతో డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లోనే రిలీజ్‌ అవుతున్నాయి. మరి ఈ నెలలో ఏయే సినిమాలు ఓటీటీలో విడుదలవుతున్నాయి? ఇంకా ఏయే చిత్రాలు రిలీజ్‌ అయ్యే అవకాశాలున్నాయో ఓసారి చూసేద్దాం..


బట్టల రామస్వామి బయోపిక్కు
అల్తాఫ్‌ హాసన్‌, శాంతి రావు, సాత్విక, లావణ్యరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం బట్టల రామస్వామి బయెపిక్కు. రామ్‌ నారాయణ్‌ డైరెక్షన్‌ చేయగా సెవెన్‌ హిల్స్‌ సతీష్‌ కుమార్‌, ఐ మ్యాంగో మీడియా రామకృష్ణ వీరపనేని నిర్మాతలుగా వ్యవహరించారు. ఆర్పీ పట్నాయక్‌ సంగీతం అందించారు. ఈ సినిమా జీ 5లో మే 14 నుంచి అందుబాటులోకి రానుంది. 


సినిమా బండి
వెరైటీ టైటిల్‌తో తెరకెక్కిన చిత్రం సినిమా బండి. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ సినిమాతో ప్రవీణ్‌ కండ్రిగుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సినిమా బండిని నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. మే 14 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో సినిమా బండి ప్రసారం కానుంది.


డీ కంపెనీ
దావూద్‌ ఇబ్రహీం జీవితకథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన చిత్రం డి-కంపెనీ. అష్వత్‌ కాంత్‌, ఇ‍ర్రా మోహన్‌, నైనా గంగూలీ, రుద్రకాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా మే 15న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ స్పార్క్‌లో విడుదల కానుంది.


నవంబర్‌ స్టోరీ
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌ సిరీస్‌ నవంబర్‌ స్టోరీ. జీఎం కుమార్‌, పసుపతి, వివేక్ ప్రసన్న, అరుళ్‌ దాస్‌, నందిని తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇంద్ర సుబ్రమణియన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆనంద వికటన్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైంది. ఈ చిత్రం మే 20న డిస్నీ+ హాట్‌స్టార్ వీఐపీలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది.  


ఏ1 ఎక్స్‌ప్రెస్‌
సందీప్‌ కిషన్‌ హాకీ ఆటగాడిగా నటించిన చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. లావణ్య త్రిపాఠి కథానాయిక. మురళీ శర్మ, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో నటించారు. మార్చి 5న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఈ మధ్యే ఓటీటీలోకి వచ్చేసింది. సన్‌ నెక్స్ట్‌లో మే 1 నుంచి ప్రసారమవుతోంది.


థ్యాంక్‌ యు బ్రదర్‌
అనసూయ భరద్వాజ్‌, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా థ్యాంక్‌ యు బ్రదర్‌. ఏప్రిల్‌ 30న థియేటర్లలో రిలీజ్‌ చేయాలనుకున్నారు. కానీ థియేటర్లు మూత పడటంతో ఓటీటీ వైపు అడుగులు వేసింది. అలా ఈ సినిమా ఆహాలో మే 7 నుంచి స్ట్రీమింగ్‌ అవుతోంది.


ఏక్‌ మినీ కథ..
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కిన చిన్న బడ్జెట్‌ చిత్రం ఏక్‌ మినీ కథ. సంతోష్‌ శోభన్‌, కావ్య థాపర్‌, శ్రద్ధా దాస్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మేర్లపాక గాంధీ రచయితగా పని చేశాడు. కార్తీక్‌ రాపోలు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌ ప్రైమ్‌ ఈ సినిమాను చేజిక్కించుకోవాలని చూస్తోందట. ఇప్పటికే చర్చలు కూడా కొనసాగుతున్నాయట. మంచి డీల్‌ కుదిరితే థియేటర్లు ఓపెన్‌ అయ్యేవరకు ఆగకుండా నేరుగా ఓటీటీలోనే రిలీజ్‌ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

అరణ్య
రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సినిమా అరణ్య. ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ హక్కులను జీ 5 ప్లాట్‌ఫామ్‌ కొనుగోలు చేసినట్లు వార్తలొస్తున్నాయి. అంతేగాక అరణ్య మే 14 లేదా ఈ నెలాఖరులో జీ 5లో ప్రసారం కానున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడాల్సిందే.

సల్మాన్‌ ఖాన్‌ 'రాధే' జీ 5లో మే 13 నుంచి ప్రసారం కానున్న విషయం తెలిసిందే. నితిన్‌ ప్రధాన పాత్రలో నటించిన చెక్‌, రంగ్‌ దే సినిమాలు కూడా ఇదే నెలలో ఓటీటీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ప్రభాస్‌ రాధేశ్యామ్‌ కూడా పే పర్‌ వ్యూ విధానంలో డిజిటల్‌ రిలీజ్‌ చేయడానికి పూనుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. ఇక హీరో ధనుష్‌ జగమే తంత్రం ఈ నెలలో కాకుండా వచ్చే నెల 18న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.

చదవండి: గోవా బ్యూటీ డిజిటల్‌ ఎంట్రీ.. త్వరలోనే ‘ఇలియానా టాక్‌ షో’

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top