తెలుగు ప్రేక్షకులను మించిన సినీ ప్రేక్షకులు ఉండరేమో: హీరో

Dulquer Salmaan At Kurup Pre Release Event - Sakshi

‘‘కురుప్‌’ సినిమా నాకు చాలా స్పెషల్‌. ట్రైలర్‌లోని విజువల్స్‌ను చూసినప్పుడు సినిమా కోసం మేం ఎంత కష్టపడ్డామో ప్రేక్షకులు అర్థం చేసుకుంటారనే ఆశిస్తున్నాను. ప్రామిస్‌ చేసి చెబుతున్నాను. ఇవి కేవలం సినిమాలో ఒక శాతమే. ఈ సినిమా స్టోరీ, ఐడియా యూనివర్సల్‌. అందుకే మలయాళంతో పాటు ఇతర భాషల్లో కూడా విడుదల చేస్తున్నాం. ‘కురుప్‌’ సినిమాకు నేనే తెలుగులో డబ్బింగ్‌ చెప్పాను ’’ అని దుల్కర్‌ సల్మాన్‌ అన్నారు. శ్రీ నాథ్‌ రాజేంద్రన్‌ దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్, శోభితా ధూలిపాళ్ల జంటగా రూపొందిన మలయాళ చిత్రం ‘కురుప్‌’.

దుల్కర్‌ సల్మాన్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగులో కూడా ఈ నెల 12న విడుదల కానుంది. ఫణికాంత్, రోహిత్‌ ‘కురుప్‌’ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో దుల్కర్‌ సల్మాన్‌ మాట్లాడుతూ– ‘‘హైదరాబాద్‌ రావడం అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు ప్రేక్షకులను మించిన సినిమా ప్రేమికులు ఉండరేమోనని నా భావన.

నా కెరీర్‌లో 2012లో వచ్చిన సినిమా ‘ఉస్తాద్‌ హోటల్‌’. అప్పట్లో నేను హైదరాబాద్‌కు వచ్చిన ఓ సందర్భంలో కొందరు నా ‘ఉస్తాద్‌ హోటల్‌’ సినిమా గురించి మాట్లాడుకున్నారు. అప్పుడు ఇంత ఓటీటీ లేదు. అయినా తెలుగు ప్రేక్షకులు నా సినిమా చూశారు. అంటే 2012లో వచ్చిన మంచి సినిమాల లిస్ట్‌ను పరిశీలించుకుని వారు ఆ సినిమాను చూసి ఉంటారు. సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు అంత ప్రేమ.

ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో నా సెకండ్‌ స్ట్రయిట్‌ ఫిల్మ్‌ తెరకెక్కుతోంది’’ అన్నారు. ‘‘తెలుగులో ‘కురుప్‌’ను విడుదల చేసే అవకాశాన్ని మాకు ఇచ్చిన దుల్కర్‌కు థ్యాంక్స్‌. సినిమాను ప్రేక్షకులు విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నిర్మాత రోహిత్‌. ‘‘నేనేదైనా కథ రాసినప్పుడు దుల్కర్‌ సలహాలు, సూచనలు తీసుకుంటాను’’ అన్నారు విన్నీ విశ్వ. ఈ కార్యక్రమంలో సంజయ్‌ రెడ్డి, రితీష్‌ రెడ్డి, నైమిష్‌ రవి, భరత్, లగడపాటి శ్రీధర్‌ పాల్గొన్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top