తమిళ హీరోయిన్‌కి టాలీవుడ్‌లో దారుణమైన అవమానం జరిగింది. ఈ విషయాన్ని సదరు హీరోయిన్ బయటపెట్టింది. డైరెక్టర్ తనని షూటింగ్ జరుగుతున్నప్పుడు చాలా అవమానించాడని, ఈ మొత్తం వ్యవహారంలో హీరో (సుడిగాలి సుధీర్) సైలెంట్‌గా ఉండటం చాలా బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
తమిళ హీరోయిన్ దివ్య భారతి.. తెలుగులో చేస్తున్న తొలి సినిమా 'గోట్'. సుడిగాలి సుధీర్ హీరోగా నరేశ్ కుప్పిలి దర్శకుడిగా రెండేళ్ల క్రితం దీన్ని లాంచ్ చేశారు. కొన్నాళ్లకు దర్శకుడు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొన్నాడు. తర్వాత నిర్మాత టేకోవర్ చేశారు. తాజాగా ఈ చిత్రం నుంచి పాట రిలీజ్ చేసి ప్రమోషన్స్ మొదలుపెడదామని అనుకున్నారు. సరిగ్గా ఇలాంటి టైంలో దర్శకుడు నరేశ్ తెరపైకి వచ్చాడు. హీరోయిన్‌ని అవమానించేలా ట్విటర్‌లో కామెంట్స్ పెట్టాడు. దీనికి దివ్యభారతి కూడా ఘాటుగా బదులిచ్చింది.
'ఇదేం లేబర్‌రా నువ్వు. ఎడిట్‌లో తీసిపడేసిన షాట్స్‌తో నెక్స్ట్ సినిమా అంతా కాలం గడిపేలా ఉన్నావ్? అసలు సెకండ్ లీడ్ హీరోయిన్ చేయాల్సింది ఈ చిలకతో వదిలావ్. పోనీ మంచి ట్యూన్ ఏం చేశావ్ రా? స్టెప్పం కొట్టిన డప్పం వెయ్యనా. ఈ ఒక్క మాటతో రెండు చేతులు గుండెపై పెట్టుకుని..' అని దర్శకుడు నరేశ్ ట్వీట్ చేశాడు. దీన్ని స్క్రీన్ షాట్ తీసి, ట్విటర్‌లో పోస్ట్ చేసిన దివ్యభారతి ఇచ్చిపడేసేలా రిప్లై ఇచ్చింది.
'మహిళలని చిలక లేదా మరేదైనా పదంతో పిలవడం జోక్ ఏం కాదు. ఇది ఆడవాళ్లపై నీకెంత ద్వేషముందో చెబుతోంది. ఇదొక్కటే కాదు సెట్‌లోనూ ఇతడు ఇలానే ప్రవర్తించేవాడు. పదేపదే మహిళల్ని కించపరుస్తూ తన కళకే ద్రోహం చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో హీరో మౌనంగా ఉండటం చూసి నేను చాలా బాధపడ్డాను. దీనివల్ల దర్శకుడికి చనువిచ్చినట్లు అయింది' అని దివ్య భారతి తన ఆవేదన వ్యక్తం చేసింది.
మరో ట్వీట్‌లో తమిళ, తెలుగు చిత్రసీమ గురించి తేడాలు చెప్పుకొచ్చింది. 'నాతో ఎప్పుడూ సమస్యలే అని చెప్పేవాళ్లకు చెబుతున్నాను. నిజాలే మాట్లాడతాయి. తమిళ ఇండస్ట్రీలో అదే టీమ్, అదే నటీనటులతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మళ్లీ మళ్లీ పనిచేశాను. కానీ ఈ ఒక్క దర్శకుడు మాత్రమే గీత దాటి ప్రవర్తించాడు. అవమానించేలా నాపై కామెంట్స్ చేశాడు. వాటిని బయటపెట్టాడు. అందుకే నేను స్పందించాల్సి వచ్చింది. ఇంకా నిన్ను నువ్వు సమర్థించుకుంటే మాత్రం అది నీ ఇష్టం' అని దివ్య భారతి రిప్లై ఇచ్చింది.
గతంలో ఈ దర్శకుడు.. విశ్వక్ సేన్ హీరోగా 'పాగల్' తీశాడు. కానీ సమస్య ఏంటో గానీ మధ్యలోనే బయటకొచ్చేశాడు. ఇప్పుడు 'గోట్' విషయంలోనూ ఇలానే జరిగింది. అయితే దర్శకుడిని విమర్శించిన హీరోయిన్ దివ్య భారతి.. హీరో సుడిగాలి సుధీర్‌ని కూడా వివాదంలోకి లాగింది. మరి అతడు ఏం సమాధానం చెబుతాడో చూడాలి?



