
కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘కె-ర్యాంప్’( K Ramp). ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసినప్పటి నుంచే బూతు సినిమా అని ట్రోల్ చేశారు. ఇక ట్రైలర్లో కూడా ఒకటి రెండు బూతు పదాలు ఉండడంతో..కె-ర్యాంప్ అంటే కూడా బూతు పదమే అని అంతా అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టైటిల్పై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. కె-ర్యాంప్ అంటే అసభ్యపదం కాదని.. దాని అర్థం కిరణ్ అబ్బవరం ర్యాంప్ అని అన్నారు. ఆయనను దృష్టిలో పెట్టుకొనే ఈ స్క్రిప్ట్ రాశానని చెప్పారు.
తాజాగా చిత్రయూనిట్ నిర్వహించిన ప్రెస్మీట్లో దర్శకుడు జైన్స్ నాని మాట్లాడుతూ.. ‘టైటిల్ చూసి అది బూతు పదం అని అంతా అనుకుంటున్నారు. కానీ మా ఉద్దేశం అది కాదు. కె-ర్యాంప్ అంటే కిరణ్ అబ్బవరం ర్యాంప్. ఈ సినిమాలో హీరో పేరు కుమార్.. అందుకే టైటిల్ అలా పెట్టాం’ అన్నారు.
కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) మాట్లాడుతూ.. థియేటర్‌లో కూర్చుని నవ్వుకునే వైబ్ ఉన్న సినిమా ఇది. ఈ సినిమా విజయం సాధిస్తుందా లేదా అనేది పక్కన పెడితే నాకు నాని రూపంలో మంచి బ్రదర్ దొరికాడు. లైఫ్‌లో నానిని ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉంటాను. సెట్‌కు వెళ్లగానే ఇద్దరం ఒకరిని ఒకరం చూసుకొని 20 నిమిషాలు నవ్వుకునే వాళ్లం. ఇది రిలీజ్ అయ్యాక ఆడియన్స్ కూడా అలానే నవ్వుతారు’ అన్నారు.
ఈ సందర్భంగా సీనియర్ నటుడు నరేశ్ మాట్లాడుతూ.. ‘‘ దర్శకుడు జైన్స్ నాని ఈ కథ చెప్పగానే, రెండే రెండు మాటలు చెప్పా. ‘నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్’ అని చెప్పా. యూత్‌తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా చూడొచ్చు. ముఖ్యంగా మేనమామ, మేనల్లుడు కలిసి చూడ్సాల్సిన చిత్రమిది’ అన్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 17న ఈ చిత్రం రిలీజ్ కానుంది.