
ప్రేమ.. ఎప్పుడు ఎవరిపై ఎందుకు పుడుతుందో చెప్పడం కష్టం. అలా ప్రేమలో పడ్డ వాళ్లు కొందరు సులభంగా పెళ్లిపీటలు ఎక్కుతారు. మరికొందరు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొని ఒక్కటవుతుంటారు. అలా ఇప్పుడు నిజంగా జరిగిన ఓ ప్రేమకథని దర్శకుడు అశ్వత్ మారిముత్తు బయటపెట్టాడు. రీసెంట్ గా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' సినిమా తీసింది ఇతడే.
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌తో విశాల్ పెళ్లి.. త్వరలోనే ముహుర్తం ఫిక్స్!)
'ఓ మై కడవులే' అనే తమిళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అశ్వత్.. దీన్ని తెలుగులో విశ్వక్ సేన్ హీరోగా 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేశారు. అలా తెలుగులోనూ అశ్వత్ మూవీ తీశాడు. రీసెంట్ గా ప్రదీప్ రంగనాథన్ హీరోగా 'రిటర్న్ ఆఫ్ డ్రాగన్' తీసి సూపర్ హిట్ కొట్టేశాడు. అయితే ఈ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేసిన విక్కీ .. ఇదే మూవీకి మేకప్ ఆర్టిస్టుగా పనిచేసిన పవిత్ర రుక్మిణి ఆదివారం నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకకు హాజరైన అశ్వత్.. వీళ్లిద్దరి ప్రేమకథ గురించి చెప్పాడు.
'నిన్న నాకు చాలా ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ విక్కీ.. పవిత్రతో నిశ్చితార్థం చేసుకున్నాడు. 'ఓ మై కడవులే' సినిమా కోసం విక్కీ నా దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. 'డ్రాగన్'కి చీఫ్ అసోసియేట్ దర్శకుడిగా పనిచేశాడు. నాతో పాటే కలిసి ఉండేవాడు. కానీ కొన్నిసార్లు జీవితం మనల్ని సర్ ప్రైజ్ చేస్తూ ఉంటుంది. అలా విక్కీ.. 'డ్రాగన్' సెట్ లో మేకప్ ఆర్టిస్ట్ పవిత్రని కలిశాడు. చూడగానే ప్రేమలో పడిపోయాడు'
'ప్రతి గొప్ప ప్రేమకథ.. నో చెప్పడంతోనే మొదలవుతుంది. వీళ్లది కూడా అంతే. బ్రేకప్ సీన్ తీస్తున్న టైంలో విక్కీ ఏడుస్తూ కనిపించాడు. ఏమైందని అడిగితే.. తను నో చెప్పింది, మాట్లాడొద్దని కూడా చెప్పిందని అన్నాడు. ఓ అన్నగా నేను కొన్ని సలహాలు ఇచ్చా. కానీ పాట తీస్తున్న టైంకల్లా వాళ్ల గాఢమైన ప్రేమలో ఉన్నారు. రీసెంట్ గా నా దగ్గరకొచ్చి.. మేం పెళ్లి చేసుకుంటున్నాం అని చెప్పడంతో నేను షాకయ్యాను' అని అశ్వత్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు)
