
హీరో నాని నిర్మించిన 'కోర్ట్' సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమాలో 'జాబిలి' పాత్రలో నటించిన తెలుగమ్మాయి శ్రీదేవి బాగా పాపులర్ అయిపోయింది. వైష్ణవ్‌తేజ్ చేసిన ‘ఆదికేశవ’లో ఓ పాత్రలో ఆమె కనిపించినప్పటికీ హీరోయిన్‌గా కోర్ట్ సినిమానే మొదటిది కావడం విశేషం. తాజాగా కొత్త కారు కొన్నట్లు శ్రీదేవి సోషల్‌మీడియా ద్వారా తెలిపింది. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది
కొత్త కారు కొనడం తన కోరిక అంటూ.. ఎంజీ హెక్టార్ (MG Hector) కారును శ్రీదేవి పోస్ట్ చేసింది. అయితే, ఈ లగ్జరీ కారు ధర రూ. 25 లక్షల వరకు వుంటుందని సమాచారం. చిన్నవయసులోనే తను అనుకున్న కలను నెరవేర్చుకుందని శ్రీదేవిపై నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కోర్టు సినిమాకు గాను రూ. 10 లక్షలు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సోషల్‌మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా ద్వారా ఆమెకు సోషల్‌మీడియాలో ఫాలోవర్స్ పెరిగారు. ఆపై పలు సినిమా ఛాన్సులు రావడంతో కాస్త సంపాదన కూడా పెరిగిందని టాక్.

శ్రీదేవి పూర్తిపేరు శ్రీదేవి ఆపళ్ల. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ ఈమె సొంతూరు. 'కోర్ట్' మూవీలో జాబిలి పాత్ర కోసం ఎవరు సెట్ అవుతారా అని డైరెక్టర్ రామ్ జగదీశ్ వెతుకుతున్న క్రమంలోనే ఈమె చేసిన ఓ ఇన్ స్టా రీల్ ని ఫ్రెండ్ చూపించాడు. దీంతో ఈమెనే జాబిలి అని ఫిక్సయ్యాడు. పిలిపించి ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశారు. ఈ ఏడాదిలోనే ఆమె ఇంటర్ పూర్తి చేసింది. అమ్మానాన్నలిద్దరూ రియల్‌ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సినిమాలు అంటే ఇష్టంతోనే ఎక్కువగా రీల్స్ చేసేదానిని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.