
రజినీకాంత్ 'కూలీ' మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతానికైతే 'వార్ 2'తో పోలిస్తే దక్షిణాదిలో ఈ సినిమాకే బోలెడు హైప్ ఉంది. టికెట్ బుకింగ్స్‌లోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు హిట్ కొడతారనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే 'కూలీ'కి ఇంత హైప్ ఏర్పడటానికి కారణం ఏంటి? ఇందులో నటించిన స్టార్స్ ఎవరికెంత పారితోషికం ఇచ్చారనేది ఇప్పుడు చూద్దాం.
చాన్నాళ్లుగా సరైన హిట్ లేని రజినీకాంత్‌కి 'జైలర్' సక్సెస్ మంచి ఊపు ఇచ్చింది. దీంతో లోకేశ్ కనగరాజ్ చెప్పిన మాస్ యాక్షన్ స్టోరీకి రజినీ ఓకే చెప్పాడు. అలా 'కూలీ' సెట్ అయింది. అయితే ఈ మూవీలో రజినీ, నాగ్, ఆమిర్ ఖాన్.. ఇలా ఎంతమంది స్టార్స్ ఉన్నప్పటికీ.. డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్, అనిరుధ్ పాటలే చాలావరకు తెలుగులో బోలెడంత హైప్‌కి కారణమని చెప్పొచ్చు.
సరే అసలు విషయానికొస్తే ఈ సినిమాని సన్ పిక్చర్స్ దాదాపు రూ.350-400 కోట్ల బడ్జెట్‌తో నిర్మించింది. అయితే ఇందులో సగం నటీనటుల పారితోషికాలకే అయిపోయింది. ఎందుకంటే హీరోగా చేసిన రజినీకాంత్ రూ.150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట. తర్వాత డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ రూ.50 కోట్లు అందుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్వయంగా లోకేశ్.. తన పారితోషికం గురించి బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: రిలీజ్‌కి ముందే 'కూలీ' వసూళ్ల రికార్డ్)
ఇక విలన్‌గా చేసిన నాగార్జునకు రూ.20-24 కోట్లు, తర్వాత అతిథి పాత్రలో నటించిన ఆమిర్ ఖాన్‌కి రూ.20 కోట్లు.. కీలక పాత్రలు చేసిన సత్యరాజ్, ఉపేంద్రకు తలో రూ.5 కోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో కీ రోల్ చేసిన శ్రుతి హాసన్ రూ.4 కోట్లు అందుకున్నట్లు టాక్. అలానే ఈ సినిమాకు అదిరిపోయే పాటలిచ్చిన అనిరుధ్‌కి రూ.15 కోట్ల వరకు రెమ్యునరేషన్ ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలా సగానికి పైగా బడ్జెట్ పారితోషికాలకే పోగా.. మిగిలిన మొత్తంతో సినిమాని నిర్మించినట్లు తెలుస్తోంది.
'కూలీ'పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళం నుంచి తొలి రూ.1000 కోట్ల సినిమా కాబోతుందని జోస్యాలు చెబుతున్నారు. కానీ అది ఎంతవరకు నిజం కాబోతుందనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. గురువారం(ఆగస్టు 14) ఉదయం 6-7 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలో పడనున్నాయి. ఇప్పటికే టికెట్స్ ఆన్ లైన్‌లో పెట్టగా బాగానే సేల్ అవుతున్నాయి. మరి ఈ 'కూలీ'.. బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి?
(ఇదీ చదవండి: రజినీకాంత్ కూలీ.. తెలంగాణలోనూ అదే పరిస్థితి!)