టాలీవుడ్‌లో మరోసారి విడుదల తేదీల గజిబిజి మొదలైంది. ఇప్పటికే ఏ నెలలో ఏ సినిమా వస్తుందో లెక్కలు వేసుకుని, హీరోల అభిమానులు కౌంట్‌డౌన్ పోస్టర్లు, సోషల్ మీడియాలో ట్రెండింగులు కూడా మొదలుపెట్టారు. కానీ ముందు అనుకున్నట్టుగా కాకుండా వరుసగా సినిమాలు వాయిదా పడుతుండటంతో పరిశ్రమలో గందరగోళం నెలకొంది.
ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన స్వయంభు ఏప్రిల్‌కు వాయిదా పడిందని ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 10న రిలీజ్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా వాయిదా పడినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించలేదు. మార్చి చివర్లో విడుదల కావాల్సిన రామ్ చరణ్ 'పెద్ది' మే నెలాఖరుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు, ప్రచారం కోసం అదనపు సమయం తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నాని హీరోగా నటిస్తున్న ది ప్యారడైజ్ మార్చి నుంచి వాయిదా పడుతూ మే 1న విడుదల చేస్తారనే ప్రచారం ఉంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి నెలకే ముందుకు జరిపే అవకాశం ఉందని టాక్. గూఢచారి 2 మే 1న రిలీజ్ అవుతుందని ముందుగా ప్రకటించారు. కానీ అదే తేదీకి ది ప్యారడైజ్ కూడా వస్తుందనే గాసిప్పులు వినిపిస్తున్నాయి. విశ్వంభర జూన్‌లో విడుదల చేయాలనే ప్లాన్ ఉంది. కానీ అప్పటికే వాయిదా పడిన సినిమాలు జూన్‌లో స్లాట్ కోసం పోటీ పడే అవకాశం ఉంది.
ఈ వరుస వాయిదాలతో టాలీవుడ్‌లో రిలీజ్ షెడ్యూల్ పూర్తిగా గందరగోళంగా మారింది. ఒక సినిమా వాయిదా పడితే దాని ప్రభావం మరో సినిమాపై పడుతోంది. దీంతో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, అభిమానులు అందరూ అయోమయంలో ఉన్నారు. మరో 10 రోజుల్లో ఈ సినిమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దాంతో అభిమానులు అధికారిక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


