
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) ప్రధాన పాత్రలో నటిస్తున్న అడ్వెంచర్ మూవీ విశ్వంభర (Vishwambhara Movie). బింబిసార ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించారు. త్రిష కథానాయికగా నటించగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. రేపు (ఆగస్టు 22) చిరంజీవి బర్త్‌డే సందర్భంగా విశ్వంభర గ్లింప్స్ వదిలారు.

ఊపిరి పోసేవాడి కోసం ఎదురుచూపులు
'ఈ విశ్వంభరలో అసలేం జరిగిందో ఈరోజైనా చెప్తావా?' అన్న పిల్లాడి డైలాగ్‌తో వీడియో ప్రారంభమైంది. 'ఒక్కడి స్వార్థం యుద్ధంగా మారి అంతులేని భయాన్నిచ్చింది. అంతకుమించిన మరణ శాసనాన్ని రాసింది. కొన ఊపిరితో బతుకున్న ఓ సమూహం తాలూకు నమ్మకం.. అలిసిపోని ఆశయానికి ఊపిరిపోసేవాడు ఒకడొస్తాడని.. ఆగని యుద్ధాన్ని యుగాలపాటు పిడికిలి బిగించి చెప్పుకునేలా చేస్తాడని గొప్పగా ఎదురుచూస్తోంది..' అంటూ మెగాస్టార్‌ను చూపించారు. విలన్లను చిత్తు చేస్తున్నట్లు యాక్షన్ సీన్స్ జత చేశారు. ఇది చూసిన అభిమానులు.. గ్లింప్స్ బాగున్నాయ్.. అని కామెంట్లు చేస్తున్నారు.
వచ్చే ఏడాది రిలీజ్
సినిమా విషయానికి వస్తే.. విశ్వంభర ఈ ఏడాది జనవరిలోనే రిలీజవ్వాల్సింది. కానీ, వీఎఫ్‌ఎక్స్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉండటంతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాదిలో సినిమా రావడం కష్టమేనని స్వయంగా మెగాస్టారే వెల్లడించారు. 2026 సమ్మర్‌లో విశ్వంభర ప్రేక్షకుల ముందుకు వస్తుందని ప్రకటించారు. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి నిర్మిస్తున్నారు. ఎమ్‌ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.