ప్రస్తుతం దక్షిణాది క్రేజీ హీరోయిన్లలో కీర్తి సురేష్( Keerthy Suresh) ఒకరు. మలయాళం చిత్ర పరిశ్రమలో బాల నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత కథానాయకిగా ఎదిగి మలయాళం, తమిళం ,తెలుగు భాషల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా రాణిస్తున్నారు. ఆ మధ్య మేరిజాన్ అనే చిత్రంతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఈఅమ్మడు నటిగా పుష్కరకాలాన్ని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది వివాహ జీవితంలోకి కూడా అడుగు పెట్టారు. కీర్తిసురేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం రివాల్వర్ రీటా ఈనెల 28న తెరపైకి రానుంది. ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలను పంచుకున్నారు. వివాహానంతరం తాను నటించిన రివాల్వర్ రీటా చిత్రం విడుదల కానుందని పేర్కొన్నారు.
తన భర్తతో కలిసి నటిస్తారని చాలామంది అడుగుతున్నారని ఆయనతో నటించే ఆలోచన లేదని చెప్పారు. అసలు ఆయన సినిమా అంటేనే పారిపోతున్నారని అన్నారు. కాగా రివాల్వర్ రీటా చిత్రాన్ని ఆయన తనతో కలిసి చూశారని చెప్పారు. అప్పుడు ఇకపై ఇలా చిత్రాలను ప్రత్యేకంగా చూడనని, థియేటర్లోనే చూస్తానని చెప్పారన్నారు. ఇది కోలమావు కోకిల(కోకో కోకిల) చిత్రానికి సీక్వెల్ కాదని స్పష్టం చేశారు. తమిళ చిత్రం తొడరిలో తన నటన గురించి ఎగతాళి కూడా చేశారన్నారు. అయితే ఆ చిత్రం చూసిన తర్వాతే మహానటి చిత్రంలో తనను ఎంపిక చేశారని చెప్పారు. ఆ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా వచ్చిందన్నారు.
ఒక ప్రమాదకరమైన వీడియోలో తాను సమంత కలిసి ఉన్నట్లు సృష్టించారన్నారు. దాన్ని చూసి తాను భయపడ్డాను అన్నారు. విదేశాల్లో మహిళలకు కొంత వరకు రక్షణ ఉంటుందని, మన దేశంలో కూడా అలాంటి పరిస్థితి రావాలని, అందుకోసం చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. తనకు దర్శకత్వం వహించాలన్న ఆసక్తి ఉందని అందుకోసం స్క్రిప్టును రాస్తున్నట్లు కీర్తిసురేష్ చెప్పారు. జీవితంలో ఒక్క సినిమాకు అయినా సరే దర్శకత్వం వహించాలనే కోరిక ఉందన్నారు.


