విడాకుల తర్వాత కొత్తిల్లు కొన్న నటి.. 'నేను పేదదాన్ని అని మీకు చెప్పానా?' | Actress Charu Asopa Reacts On Trolls As She Buys New House After Leaving Mumbai, Deets Inside | Sakshi
Sakshi News home page

విడాకులతో పుట్టింటికి వెళ్లిన నటి.. కొత్తింటి కొనుగోలుకు డబ్బులెలా వచ్చాయ్‌?

Apr 30 2025 1:08 PM | Updated on Apr 30 2025 3:38 PM

Charu Asopa Reacts on Trolls as She Buys New House after Leaving Mumbai

విడాకులు తీసుకున్న మగవాడిని ఈ సమాజం పట్టించుకోదేమో కానీ ఆడవారిని మాత్రం చులకనగా చూస్తుంది. అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ అంటోంది బుల్లితెర నటి చారు అసోపా (Charu Asopa). హీరోయిన్‌ సుష్మితా సేన్‌ సోదరుడు రాజీవ్‌ సేన్‌ను 2019లో గోవాలో పెళ్లి చేసుకుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి గుర్తుగా జియానా అనే పాప కూడా పుట్టింది. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. అవి పెద్దవి కావడంతో విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. అలా 2023లో వీరికి విడాకులు మంజూరయ్యాయి.

నెలకు రూ.1 లక్ష పైనే..
ఆ తర్వాత ఆమెకు ముంబైలో ఇ‍ల్లు దొరకడం కూడా కష్టమైంది. సింగిల్‌ పేరెంట్‌ అని కొందరు, సెలబ్రిటీ అని మరికొందరు ఇల్లు ఇవ్వడానికే ఇష్టపడలేదు. చివరకు ఎలాగోలా సిటీ అంతా జల్లెడపట్టి అద్దెల్లు సంపాదించింది. కానీ చేతిలో సంపాదన లేనప్పుడు నగరంలో జీవించడం అంత ఈజీ కాదు. నెలవారీ ఖర్చులు లక్ష రూపాయల పైనే అవుతుండటంతో సొంతూరుకు వెళ్లిపోయింది. రాజస్థాన్‌లోని బికనీర్‌లో తన పుట్టింట్లో ఉంటోంది. 

డబ్బెలా వస్తోంది?
అక్కడే బట్టల వ్యాపారం ప్రారంభించింది. అలాగే తను కొన్న కొత్తింటిని కూడా వీడియో తీసి చూపించింది. ఆ ఇంటికి ఆమె నెలనెలా ఈఎమ్‌ఐ కడుతోంది. ఇది చూసిన జనాలు తనకు డబ్బులెలా వస్తున్నాయి? ఈ ఇల్లు ఎలా కొనగలిగింది? అంటూ రకరకాల కామెంట్లు చేశారు. వాటిపై చారు అసోపా తాజాగా తన యూట్యూబ్‌ ఛానల్‌ వేదికగా స్పందించింది. నేను రైల్లో వెళ్లకుండా విమానంలో ఎందుకు ప్రయాణిస్తున్నాను? అని కొందరడిగారు. 

సింపతీ అక్కర్లేదు
ఆ ఎయిర్‌లైన్స్‌ వాళ్లు నన్ను ఆహ్వానించడం వల్లే విమానయానాన్ని ఎంచుకున్నాను. నేను షాపింగ్‌ చేస్తుంటే కూడా విమర్శిస్తున్నారు. కొత్తింటి విషయానికి వస్తే.. నెలనెలా అద్దె కట్టే బదులు అదే ఈఎమ్‌ఐ కడుతున్నాను. నన్ను విమర్శించడం ఆపండి.. మీ అందరికీ నేను చెప్పదలుచుకుందేంటంటే.. నేను పేదదాన్ని కాదు. దేవుడి దయ వల్ల నా ఖర్చులు నేను భరించగలను. నాకు ఎవరి సింపతీ అక్కర్లేదు. టీవీ ఇండస్ట్రీ నుంచి బ్రేక్‌ తీసుకోవాలనుకున్నాను. అందుకే ముంబై వదిలి వచ్చేశాను తప్ప పని లేక కాదు అని నటి వివరణ ఇచ్చింది.

సీరియల్స్‌.. సినిమా
చారు అసోపా.. అగ్లే జనం మోహే బిటియా హీ కిజో, యే రిష్తా క్యా కెహ్లాతా హై, బాల్‌వీర్‌, దేవోంక్‌ కె దేవ్‌.. మహాదేవ్‌, లవ్‌ బై ఛాన్స్‌, ఫిర్‌ జీనే కీ తమన్నా హై, లాడూ 2, జిజీ మా, కర్ణ్‌ సంగిని, విక్రమ్‌ బేతాల్‌ కీ రహస్య గాథ, కైసా హై యే రిష్తా అజంనా వంటి సీరియల్స్‌ చేసింది. ఇంపేషెంట్‌ వివేక్‌, కాల్‌ ఫర్‌ ఫన్‌, యోక్‌, జోహ్రి అనే సినిమాల్లోనూ నటించింది.

చదవండి: సడన్ గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమాలు

Advertisement
 
Advertisement
Advertisement