టాలీవుడ్‌లో తెలంగాణ దర్శకుల హవా పెరుగుతుంది. బలగం, పరేషాన్, రాజు వెడ్స్ రాంబాయి.. ఇలా తెలంగాణ బ్యాక్‌డ్రాప్ సినిమాలు కూడా మంచి విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా తెలుగులోకి మరో తెలంగాణ దర్శకుడు ఎంట్రీ ఇచ్చాడు. తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్.. చంద్రయాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా శుక్రవారం(నవంబర్ 13) థియేటర్లలో రిలీజైంది.
(ఇదీ చదవండి: ‘చంద్రయాన్’ మూవీ రివ్యూ)
సినిమా రిలీజ్ సందర్భంగా దర్శకుడు శ్రీనాథ్ చంద్రశేఖర్ నేడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మాది సిద్దిపేట దగ్గర హుస్నాబాద్. చదువుకునేటప్పటి నుంచే సినిమాలంటే ఆసక్తి. బీటెక్ చదువుతున్నప్పుడే ఛార్మి మంగళ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాను. తర్వాత 3G లవ్‌కి దర్శకత్వ శాఖలో చేశాను. తర్వాత కొన్నాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా, మ్యాథ్స్ ట్యూటర్‌గా పనిచేశాను. కానీ సినిమాల మీద ఇష్టంతో అవన్నీ వదిలేసి ఇండస్ట్రీలోకి పూర్తిగా వచ్చేశాను.
రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా అనేక సినిమాలకు ఈటీవీ, జెమిని, జీటీవీలోని సీరియల్స్‌కు పనిచేశాను. దర్శకులు నీలకంఠ, కన్మణి దగ్గర పనిచేశాను. సాధారణంగా సినిమా వాళ్లకు ఉండే కష్టాలు, అసిస్టెంట్ డైరెక్టర్ కి ఉండే కష్టాలు అన్ని పడే దాదాపు పదేళ్లకు పైగానే సినీ పరిశ్రమలో పనిచేసి ఇప్పుడు దర్శకుడిని అయ్యాను.
'చంద్రయాన్' గురించి మాట్లాడుతూ.. ఊళ్ళో ఉన్నప్పుడే ఈ ఆలోచన వచ్చింది. ప్రేమించిన అమ్మాయి ఎవరెవరితోనో పోలుస్తూ నువ్వేమి చేయలేవా అంటే రాకెట్ తయారుచేసి చంద్రుడి మీదకు వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ కథని రాసుకున్నాను. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఊళ్ళల్లో ఉండే కుర్రాళ్ళు, వారి మధ్య కామెడీతో, ఊళ్ళల్లోని జనాలు, ప్రేమ, చంద్రుడి మీదకు రాకెట్ ప్రయోగం.. వంటి అంశాలతో ఈ కథని రాసుకున్నాను. సినిమా తెరకెక్కించేటప్పుడు రియల్ లొకేషన్స్ కావడంతో మొదటి సినిమాకు చాలానే కష్టాలు పడ్డాను. సినిమా అయ్యాక దర్శకుడు వేణు ఉడుగుల గారు మా సినిమా చూసి నచ్చడంతో ఆయనే రిలీజ్ చేస్తామని ముందుకు వచ్చారు. నా మొదటి సినిమానే ఆయన రిలీజ్ చేయడం నాకు ఆనందంగా ఉంది అని అన్నారు. తెలంగాణ సంసృతిని చూపిస్తూనే ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేయాలనేదే నా కోరిక అని శ్రీనాథ్ చెప్పుకొచ్చాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: త్రిగుణ్ కూతురిని చూశారా? ఇదేం కెప్టెన్సీ టాస్క్)


