బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. రామ్‌నగర్ బన్నీ సినిమాతో హీరోగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఇప్పుడు రెండో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఆ మూవీయే బరాబర్ ప్రేమిస్తా. ఈ చిత్రంలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘనా ముఖర్జీ హీరోయిన్‌గా నటిస్తోంది. అర్జున్ మహి విలన్‌గా యాక్ట్ చేశాడు.
నాన్న సపోర్ట్ చేయలేదు
సంపత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో చంద్రహాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చంద్రహాస్ మాట్లాడుతూ.. నాకు 17 ఏళ్ల వయసున్నప్పటి నుంచే యాక్టింగ్ వైపు రావాలనిపించింది. నాన్న సపోర్ట్ చేయలేదు. 25 ఏళ్లు వచ్చాకే సపోర్ట్ చేస్తానన్నాడు. అప్పటిదాకా ఖాళీగా ఎందుకుండాలి? అనుకున్నాను. ట్రిప్పులు తిరిగాను. అప్పటికి నేను 12th పాస్ అంతే! దాంతో మా అమ్మ బ్లాక్‌మెయిల్ చేసింది.
అమ్మ ఏడుపు వల్లే..
నా కొడుకు 12వ తరగతి వరకే చదివాడని ఎలా చెప్పుకోవాలి? తలెత్తుకుని ఎలా తిరగాలి? అని ఏడ్చేసింది. తనకోసం కాలేజీలో జాయిన్ అయ్యా.. ఓపక్క చదువుకుంటూనే సినిమాలు, షార్ట్ ఫిలింస్‌కి ట్రై చేద్దామనుకున్నాను. ఓ పెద్ద ఆఫీస్‌కు వెళ్తే చాలాసేపు వెయిట్ చేయించారు. చివరకు ఆ క్యారెక్టర్‌కు నేను సెట్ కానని చెప్పారు. కనీసం ఆఫీస్ లోపలకు కూడా పిలవలేదు. నేను ప్రభాకర్ కొడుకునని ఆయనకు తెలుసు. నేను ఆయన కొడుకును కాకపోయుంటే వాళ్లు చేసినదాన్ని పట్టించుకునేవాడినే కాదు.
ఆయన కొడుకుని కాకపోయుంటే..
అసలు ప్రభాకర్ కొడుకుని కాకపోయుంటే ఈపాటికి చాలా సినిమాలు చేసేవాడిని.. చిన్న క్యారెక్టర్ లేదా పెద్ద పాత్రలు ఏవైనా చేసుకుంటూ పోయేవాడిని. కానీ, ఇప్పుడు నాకు ఆ స్వేచ్ఛ లేదు. ఆరోజు జరిగిన ఘటనతో గట్టిగా ఒకటి డిసైడయ్యా.. నన్ను ఉన్నత విద్య కోసం భారీగా ఖర్చు పెట్టి విదేశాలకు పంపించొద్దు.. ఆ డబ్బు ఏదో నేను చేయబోయే పాటకు ఇవ్వు. రూ.10-15 లక్షలు ఇస్తే ఓ పాట చేసుకుంటా అన్నాను. అది చూసి ఎవరైనా సినిమా ఛాన్సులిస్తారన్నది నా ఆశ!అనుకున్నట్లే సినిమా ఆఫర్ వచ్చింది అని చెప్పుకొచ్చాడు.


