యంగ్ హీరో రోషన్ నటించిన 'ఛాంపియన్' సినిమా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు తాజాగా ప్రకటన వచ్చేసింది. శ్రీకాంత్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రోషన్.. గత ఏడాది డిసెంబర్ 25న ఈ మూవీతో తెరపైకి వచ్చాడు. ఈ సినిమాని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించగా.. మహానటి, సీతారామం వంటి విజయాల తర్వాత స్వప్న దత్ నిర్మించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు.
ఛాంపియన్ సినిమా జనవరి 29న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని ఆ సంస్థ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంలో స్ట్రీమింగ్ కానుందని ఒక పోస్టర్‌ను షేర్ చేశారు. సుమారు రూ. 45 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 17 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ మూవీలో రోషన్‌కు జోడీగా అనస్వర రాజన్ నటించగా.. సంతోష్ ప్రతాప్, అవంతిక, కృతి కంజ్ సింగ్ రాథోడ్, హైపర్ ఆది తదితరులు కనిపించారు. సంగీతం మిక్కీ జే మేయర్ సినిమాకు ప్రదాన ఆకర్షణగా నిలిచింది.

కథేంటి..?
ఈ సినిమా కథంతా 1747-48 ప్రాంతంలో జరుగుతుంది. సికింద్రాబాద్‌లోని ఒక బేకరీలో పని చేసే మైఖేల్(రోషన్)కి ఫుట్‌బాల్ ఆట అంటే చాలా ఇష్టం. ఈ ఆటతోనే ఎప్పటికైనా ఇంగ్లాండ్ వెళ్లి..అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటాడు. ఓసారి ఇంగ్లాండ్ వెళ్లే అవకాశం వస్తుంది. కానీ అతని తండ్రి చేసిన ఓ పని వల్ల వెళ్లలేకపోతాడు. దొంగమార్గాన ఇంగ్లాండ్ వెళ్లాలనుకుంటాడు. దాని కోసం కొన్ని తుపాకులను ఒక చోటుకి తరలించాల్సి వస్తుంది. ఆ పని చేసే క్రమంలో పోలీసుల కంటపడతారు. వారి నుంచి తప్పించుకొని అనుకోకుండా బైరాన్‌పల్లి అనే గ్రామానికి వస్తాడు. అదే ఊరికి చెందిన చంద్రకళ(అనస్వర రాజన్)తో పరిచయం.. నిజాం పాలకులకు వ్యతిరేకంగా ఆ ఊరి ప్రజలు చేసిన తిరుగుబాటు రోషన్‌లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది? పోలీసు అధికారి బాబు దేశ్‌ముఖ్ (సంతోష్ ప్రతాప్)తో మైఖేల్ గొడవ ఏంటి? బైరాన్‌పల్లి ప్రజల కోసం మైఖేల్ చేసిన త్యాగమేంటి? అనేదే మిగతా కథ.


