
'ఆపరేషన్ సిందూర్' టైటిల్ హక్కుల కోసం బాలీవుడ్‌లోని టాప్ సినీ నిర్మాణ సంస్థలు పోటీ పడుతున్నాయి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత్ దాడి చేసిన విషయం తెలిసిందే. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో భారత్ విరుచుకుపడింది. ఈ పేరు చాలా శక్తివంతంగా ఉందని గుర్తించిన సినీ మేకర్స్ టైటిల్ హక్కుల కోసం క్యూ కడుతున్నాయి.
ఇప్పటికే అనేక మంది నిర్మాతలు ఆపరేషన్ సిందూర్ టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారని ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) అధ్యక్షుడు BN తివారీ ఇండియా టుడేతో ధృవీకరించారు. ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ కోసం పనిచేసే సంఘాలలో ఒకటి)లో దాదాపు 15 మంది చిత్రనిర్మాతలు, స్టూడియోలు కూడా ఇదే టైటిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాయన్నారు.
హిందీ చిత్ర పరిశ్రమ నిర్మాతలు నిన్నటి నుంచి "ఆపరేషన్ సిందూర్" అనే టైటిల్ రేసులో మహావీర్ జైన్ ఫిల్మ్స్ ముందంజలో ఉందని, ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసిన మొదటి బ్యానర్ అని సమాచారం. ప్రముఖ దర్శకుడు మధుర్ భండార్కర్ కూడా ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేశారని తెలుస్తోంది. ఆపై ప్రముఖ బ్యానర్లు జీ స్టూడియోస్, టి-సిరీస్ ఈ టైటిల్‌ను రిజిస్టర్ చేసిన తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ బ్యానర్‌లన్నీ కూడా ఇటీవలనే పహల్గామ్ దాడిని ప్రపంచానికి చూపాలని పహల్గామ్ పేరుతో టైటిల్‌ను రిజిస్టర్ చేసుకున్నాయి. అయితే, "ఆపరేషన్ సిందూర్" అనేది ఒక శక్తివంతమైన టైటిల్ కావడంతో చాలామంది పోటీపడుతున్నారు.