
పలు సూపర్ హిట్ సినిమాల్లో మెప్పించిన బాలీవుడ్ నటి చాహత్ ఖన్నా. తన అందం, అద్భుతమైన నటనతో అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్‌లో ద ఫిలిం, థాంక్యూ, ప్రస్థానం, యాత్రిస్ సినిమాలతో పాటు బుల్లితెరపై కాజల్, ఖుబూల్ హై వంటి సీరియల్స్‌లో చాహత్ నటించింది.
అయితే 2006లో భరత్ నర్సింగనిని పెళ్లాడిన ముద్దుగుమ్మ.. నాలుగు నెలలకే విడాకులిచ్చింది. ఆ తర్వాత 2013లో ఫర్హాన్ మీర్జాను పెళ్లాడగా 2018లో అతనితో కూడా తెగదెంపులు చేసుకుంది. రెండుసార్లు పెళ్లి చేసుకోగా రెండుసార్లూ విడాకులే తీసుకుంది చాహత్ ఖన్నా. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె రెండోసారి విడాకులు తీసుకోవడంపై మాట్లాడింది. కేవలం తన పిల్లల భవిష్యత్తు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.
రెండోసారి విడాకుల గురించి చాహత్ మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ నాకు సరైనది అనిపించిన దాన్నే చేశా. దానికే కట్టుబడి ఉంటా. ఏదైనా తప్పని అనిపిస్తే అలాంటి పని చేయను. ఎవరైనా తప్పు చేస్తుంటే కూడా చెప్పే ధైర్యం నాకు ఉంది. ప్రపంచం ఏమి చెప్పినా నేను ఎప్పుడూ తప్పును సమర్ధించను. మీకు ఆ రకమైన నమ్మకం, ధైర్యం, ఆత్మగౌరవం ఉండాలి. కేవలం ఒక మహిళగా మాత్రమే కాదు, ఒక మనిషిగా.. ఏదైనా కరెక్ట్ కాదనిపిస్తే అందులో భాగం కాలేను. అలాంటి వాటికి నేను దూరంగా వెళ్తాను. అలాగే మనం పిల్లల కోసం ఆలోచిస్తూ మనకు సరిగాలేని వివాహ బంధంలో ఉండిపోకూడదు. ఎందుకంటే పిల్లలు మనకంటే ఎక్కువగా ప్రభావితమవుతారు. అది కలిగించే నష్టం మీకు కూడా తెలియదు. వారు పెద్దయ్యాక వారి స్నేహితుల నుంచి విన్నప్పుడు మాత్రమే మీకు తెలుస్తుంది. అందుకే నా కుమార్తెల కోసం నేను దూరంగా వెళ్లాలని నిర్ణయించుకున్నా' అని తెలిపింది.